రంగారెడ్డి, మే 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ భూముల మార్కెట్ విలువ పెంచాలన్న నిర్ణయంతో జిల్లాలో రియల్ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. మార్కెట్ విలువ పెంపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా..కలెక్టర్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దీంతో జూన్ 1 నుంచి పెంచిన మార్కెట్ విలువ అమల్లోకి రానున్నది.
కాగా, జిల్లాలోని అత్యధిక మండలాల్లో భూముల మార్కెట్ విలువ యాభై నుంచి వందశాతం వరకు పెరగనున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువకు ఎలాంటి పొంతన లేదు. క్షేత్రస్థాయిలో బహిరంగ మార్కెట్లో జిల్లాలోని పలు మండలా ల్లో సుమారు పది నుంచి పదిహేను కోట్లకు ఎకరా చొప్పున ధర ఉండగా.. ప్రభుత్వ మార్కెట్ విలువ అందుకు భిన్నంగా ఉన్నది.
దీంతో మార్కెట్ విలువ, క్షేత్రస్థాయిలో ఉన్న భూ ముల విలువను గుర్తించి పెంచాలని నిర్ణయించా రు. పెరిగిన ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే అదనపు భారం పడుతుందని ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. జిల్లాలోని మోకిళ్ల, మహేశ్వరం, శంకర్పల్లి వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మార్కెట్ ధరల పెంపు ప్రభా వం స్పష్టంగా కనిపిస్తున్నది. మోకిళ్ల వంటి ప్రాం తాల్లో విల్లాలు, అపార్ట్మెంట్ల కల్చర్ అధికంగా ఉండటంతో ఒక్కో డాక్యుమెంట్ విలువ రూ. కోట్లలో ఉండటంతో రిజిస్ట్రేషన్ వాల్యూవేషన్ మాత్రం రూ. లక్షల్లోనే ఉన్నది.
మొదటి విడతలో జిల్లాలోని అవుటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాల్లోనే భూముల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించి అందుకనుగుణంగా ప్రతిపాదనలను రూపొందించారు. వాటికి ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభించటంతో జూన్ 1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కాగా, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, గండిపేట, శేరిలింగంపల్లి, బడంగ్‌పేట, మీర్‌పేట వంటి ప్రాంతాల్లో ఈ ధరలు భారీగా పెరగనున్నాయి. అవుటర్‌రింగ్ రోడ్డు లోపల ఒక్కో ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో ధరలు ఒక్కో రకంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల వారీగా బహిరంగ మార్కెట్ భూముల విలువపై అదనంగా మార్కెట్ విలువ పెంచుతున్నారు. దీంతో జిల్లాలో భూముల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గండిపేట, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, తుర్కయాంజాల్, తుక్కుగూడ, నానక్‌రాంగూడ, నార్సింగి, మణికొండ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వాణిజ్య భూముల బహిరంగ మార్కెట్లో గజానికి రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు పలుకుతున్నది. ఈ ప్రాం తాల్లో విల్లాలు, అపార్ట్మెంట్ల క్రయవిక్రయాలు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. వాటికీ మా ర్కెట్ విలువ పెంచే అవకాశాలున్నాయి.
రియల్ఎస్టేట్ వ్యాపారంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉన్నది. ఇప్పటికే జిల్లాలో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో రూ. కోట్లకు చేరాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ఇన్వెస్టర్లకు మార్కెట్ విలువ పెంపు మరింత భారం కానున్నది. ఈ పరిస్థితిలో జిల్లాలో రియల్ఎస్టేట్ రంగం మరింత కుదేలయ్యే అవకాశాలున్నాయి.