రంగారెడ్డి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు పెద్దఎత్తున రావడంతో రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎన్నికల అనంతరం పుంజుకుంటుందని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి ఓపెన్ ప్లాట్లుగా మార్చారు.
జిల్లా పరిధిలోని శంకర్పల్లి, తుక్కుగూడ, శంషాబాద్, ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, కందుకూరు, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టి.. అమ్మకాలు లేక కుదేలవుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ప్లాట్లు, విల్లాలు అమ్ముకోలేక పలువురు బిల్డర్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి అభివృద్ధి లేక ప్లాట్ల ధరలు పెరగడంలేదు.
అమ్ముకోలేక.. ఉంచుకోలేక..
జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో రియల్ వ్యాపారులు కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసి ఓపెన్ ప్లాట్లుగా మార్చారు. ప్రస్తుతం ఓపెన్ ప్లాట్లను అమ్ముకోలేక అనేక అగచాట్లకు గురవుతున్నారు. గతంలో భూముల ధరలు ఎక్కువ ఉన్నప్పుడు భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చిన వ్యాపారులు ధరలు తగ్గించి అమ్ముదామన్నా కొనేవారు లేకుండా పోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా పరిధిలోనే పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు హాట్కేక్కుల్లా అమ్ముడుపోయేవి. కాని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అమ్ముదామన్న కొనేవారులేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ రంగాన్ని వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడింది.
రెండేండ్లు గడుస్తున్నా..
గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. కొనేవారులేక, అమ్మకాలు జరగక రియల్ ఎస్టేట్ కార్యాలయాలు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్లాట్లు, భూములు విక్రయాలతో నెలకు జిల్లా నుంచి సుమారు వందకోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ రంగాన్ని నమ్ముకున్న వ్యాపారులు, బ్రోకర్లు రోడ్డున పడుతున్నారు.
నగరం చుట్టూ ఇదే పరిస్థితి..
జిల్లా పరిధిలో రీజినల్ రింగ్‌రోడ్డు, ఫ్యూచ ర్సిటీ వస్తున్నప్పటికి కూడా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంలేదు. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో ఇప్పటికే వేలాది వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేవారు మాత్రం రావడంలేదు. మరోవైపు జిల్లా మొత్తం హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకోవడంతో అనుమతులు కూడా సకాలంలో రావడంలేదని కొనుగోలు చేసినవారు వాపోతున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న సుమారు 56 గ్రామపంచాయతీల్లో కూడా భూములు, ప్లాట్ల కొనుగోళ్లు అంతగా జరగడంలేదు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని ప్రభుత్వం భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడంలేదు. దీంతో ఈ రంగాన్ని నమ్ముకున్న వ్యాపారులు, రియల్ బ్రోకర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.