రంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రెవెన్యూశాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కుతున్నాయి. ఆ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైసలు లేనిదే ఫైళ్లు ముందుకు కదలవని వస్తున్న ఆరోపణలను రెవెన్యూ శాఖ సిబ్బంది నిజం చేస్తున్నారు. మంగళవారం జిల్లాలోని తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. తన భూమి పేరు మార్పు కోసం తహసీల్దార్‌ను ఆశ్రయించగా లంచం ఇస్తేనే పని చేస్తానని తేల్చిచెప్పడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మంగళవారం ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో తహసీల్దార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ కృష్ణ ఏసీబీకి దొరికిపోయిన విషయం మరువక ముందే తలకొండపల్లి తహసీల్దార్ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఇబ్రహీంపట్నం ఆర్ఐ 10 గుంటల భూమి మార్పి డి కోసం రూ.3 లక్షలు డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని 15 రోజులు కూడా గడవకముందే తలకొండపల్లి తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు.
జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పైసలు లేనిదే ఫైళ్లు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ధరణి, భూభారతిల్లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండడంలేదు. ఆ ఫైళ్లు ఏండ్ల తరబడిగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చినా తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టా భూములు సైతం తమ పేరున ఎక్కించుకునేందుకు అన్నదాతలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో భూసంబంధిత సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భూసంబంధిత సమ స్యలను పరిష్కరించాలని అధికారులకు వచ్చిన దరఖాస్తులు 25,000 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’లో దరఖాస్తు పెట్టుకున్నా పరిష్కారం కావడంలేదని రైతులు వాపోతున్నారు.