రాష్ట్రంలోనే రెవెన్యూ పరమైన కేసుల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున భూ సమస్యలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. జిల్లాలో పెద్ద ఎత్తున వస్తున్న పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు ఓఆర్ఆర్ వంటి ప్రాజెక్టులు రావడంతో శివారు ప్రాంతాల్లోనే భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఒక ఎకరం ధర రూ.కోటి మొదలుకుని రూ.20 కోట్ల వరకు చేరుకోవడంతో ఆయా భూములకు సంబంధించి వ్యక్తులు కూడా కేసులు వేస్తున్నారు. గతంలో అమ్మిన భూములపై కూడా తాము వారసులమంటూ కేసులు వేస్తున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో అత్యధికంగా మండలాలు, మున్సిపాలిటీలు ఉండడం వల్ల వీటి పరిధిలో వెంచర్లు, భవన నిర్మాణాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో తమకు ఎంతోకొంత వస్తుందన్న ఆశతో సంబంధం లేని వ్యక్తులు సైతం కేసులు వేస్తున్నారు. వీటికితోడు మ్యుటేషన్లు, పట్టామార్పిడిలు, 3080 వంటి కేసులు పెరిగాయి. ఇప్పటికే జిల్లాలో 20వేలకు పైగా రెవెన్యూ పరమైన కేసులు ఉండగా, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనూ అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడం విశేషం.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)
20వేలకు పైగా రెవెన్యూ కేసులు..
జిల్లాలో సుమారు 20 వేలకు పైగా రెవెన్యూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల లాగిన్లలో ఈ కేసులు ఏండ్ల తరబడి మగ్గుతున్నాయి. కేసులు పరిష్కరించాల్సిన జాయింట్ కలెక్టర్ రెవెన్యూ పోస్టు గత ఆరు మాసాలుగా ఖాళీగా ఉండడమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టులో అప్పటి రెవెన్యూ జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డిని ఏసీపీ అధికారులు పట్టుకోవడంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉన్నది. ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రెవెన్యూ, స్థానిక సంస్థల రెండింటి బాధ్యతలు మోస్తున్నారు. తమకున్న శాఖలతో సతమతమవుతున్న ఆమె అదనపు సమస్యలను చూసేందుకు సరైన సమయం దొరకడంలేదు. జిల్లాలో అత్యధికంగా మున్సిపాలిటీలు 13 ఉన్నాయి. వీటికి తోడు 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటి బాధ్యతతో పాటు, జిల్లావ్యాప్తంగా ఉన్న 549 గ్రామపంచాయతీల బాధ్యత కూడా ఆమెనే చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో అదనపు బాధ్యతతో ఆమె రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలతో పాటు సివిల్‌సప్లయ్, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించి కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో జిల్లాలో రెవెన్యూ పరమైన కేసులు ఏటేటా పెరగడం పరిష్కారానికి నోచుకోవడం లేదు.
రెవెన్యూ జాయింట్ కలెక్టర్ పోస్టు ఖాళీ..
గత సంవత్సరం ఆగస్టులో రెవెన్యూ జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డిని ఏసీపీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం లభించలేదు. ఆరు మాసాలుగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ పోస్టు ఖాళీగా ఉన్నందున రెవెన్యూ సమస్యలతో పాటు సివిల్‌సప్లయ్ వంటి సమస్యలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దరఖాస్తుదారులు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
నలుగురు కలెక్టర్ల బదిలీతో పెండింగ్‌లో రెవెన్యూ సమస్యలు..
జిల్లాలో గత సంవత్సర కాలంలో తరచుగా కలెక్టర్లు మారడం కూడా రెవెన్యూ పరమైన కేసుల పరిష్కారానికి అడ్డంకిగా మారింది. సంవత్సర కాలంలో హరీశ్, అమెయ్‌కుమార్, భారతి హోలికేరీ, శశాంకలు బదిలీ అయ్యారు. వీరు జిల్లాలో తక్కువ కాలం పని చేశారు. మరికొంత మంది రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించేలోపే బదిలీ అయ్యారు. దీంతో రెవెన్యూ సమస్యలు ఏండ్ల కొద్దీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తరచూ కలెక్టర్లు మారడంతో, ధరణిలో వారు థంబ్పెట్టే లోపే బదిలీ ఆర్డర్లు రావడంతో కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..
జిల్లాలో గత ఆరు మాసాలుగా రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో ఉండడంతో రెవెన్యూ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి నాలాంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా కలెక్టర్ కార్యాలయం చుట్టూ పదేపదే తిరగాల్సిన పరిస్థితి నెలకొన్నది. వెంటనే జిల్లాలో రెవెన్యూ సంబంధిత కలెక్టర్‌ను నియమించి సమస్యలను పరిష్కరించాలి.
– కృపేశ్, మాజీ ఎంపీపీ