మణికొండ, ఫిబ్రవరి 5: వేదం నమామి.. సదాస్మరామి అన్నది వేదవాజ్ఞయ నార్యోక్తి. మానవుడి జీవనయానంలో సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగై పోతున్నాయి. వేద పండితుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. ఈ క్రమంలో దేశంలోని శృంగేరి(కర్నాటక), పూరి జగన్నాథ్(ఒరిస్సా), బద్రినాథ్(ఉత్తరాంచల్), ద్వారకా(గుజరాత్) పీఠాలతో పాటు మన రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని చినజీయర్ స్వామి ఆశ్రమం సనాతన ధర్మాన్ని కాపాడడానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రాంతాలలో వేద పాఠశాలలు నెలకొల్పి ఉచిత వసతి, భోజనం, బోధన, శిక్షణ సాగిస్తున్నాయి. సామ, రుగ్వేదం, యజుర్వేదం, అదర్వణతో పాటు వాటిలోని అంగాలు, ఆగమ శాస్ర్తాలు నేర్పుతూ సమాజానికి అవసరమైన వేదపండితులను అందించడంతో పాటు వేదవాజ్ఞయాన్ని పరిరక్షించడంలో ప్రధానపాత్రను పోషిస్తున్నది.
ఇక్కడ కఠిన నియమాలతో కూడిన బోధనను అందిస్తారు. ఈ గురుకులంలో ప్రవేశాలకు 8 ఏండ్ల ప్రాయం నుంచి అన్ని వర్గాల వారిని చేర్చుకుంటారు. ప్రస్తుతం 215 మంది విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. ప్రవేశం పొందిన మొదటి రెండు సంవత్సరాలు ఫౌండేషన్ తరగులు ఉంటాయి. ఆ తర్వాత జ్యోతిష్యం,శాస్త్రం, వ్యాకరణం, చతుర్వేదాలు, యజుర్వేదంలోని మూడు అంగాలను బోధిస్తారు. ఇక్కడ వేద విద్యను అభ్యసించిన వారు దేశ, విదేశాలతో పాటు ప్రధాన ఆలయాల్లో పని చేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు 12 సంవత్సరాలు వేద విద్యను అభ్యసిస్తారు. వీరికి వేద విద్యతో పాటు ఆలయాల్లో క్రతువులు నిర్వహించడం నేర్పిస్తారు. అంతేకాక ఇతర ఉన్నత చదువులు చదివే అవకాశం సైతం ఉంటుంది. ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించి వారి స్థాయిని నిర్ధారిస్తారు. వేద విద్యతో పాటు స్టేట్ సిలబస్‌ను సైతం నేర్పిస్తారు. ఇప్పటి వరకు 15 బ్యాచ్‌లు పరీక్షలకు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
దేశంలో ప్రతిపౌరుడు సమాజ శ్రేయసును పెంచుకుంటే చాలు.. సంస్కృతి, సంప్రదాయాలతో పాటు దేశం సుభిక్షంగా ఉంటుందన్న సదుద్దేశంతో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి వేదవిజ్ఞానాన్ని అందరికి అందేలా ‘జీవా గురుకులం’లో వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. పెద్ద జీయర్ స్వామి శతాబ్ది చిహ్నంగా 2009లో జూన్ 9న శ్రీరామనగరంలో జీవా(జీయర్ ఇంటిగ్రేటెడ్ అకాడమీ)ను స్థాపించారు. సమస్త జగత్తు సృష్టి, స్థితి రహస్యాలను తెలియజేయాలని సంకల్పించుకున్న స్వామిజీ విద్యార్థులకు చతుర్వేదాలతో మరో మూడు అంగాలను నేర్పిస్తున్నారు.
వేద ఘోషతోనే శ్రీరామనగరంలో తెల్లవారుతుంది. ఉదయం నాలుగు గంటలకే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఐదు గంటలకు వ్యాయాయం, ప్రాత:స్మరణ, సంధ్యావందనం, యోగా సాధన చేయిస్తారు. ఉదయం 8 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. నాలుగు అంశాల బోధన తర్వాత మధ్యాహ్న సంధ్యావందనం, భోజనం చేస్తారు. సాయంత్రం క్రీడలు, పారాయణాల పఠనం, సాయం సంధ్యావందనాలు చేస్తారు. రాత్రి 9 గంటలకు భోజనంతో దినచర్య ముగుస్తుంది. కఠోర సాధనతో నిష్ణాతులైన ఆచార్యుల శిక్షణలో ఇక్కడి విద్యార్థులు అన్ని అంశాల్లో రాటు దేలుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
భారతీయ వేద వాజ్ఞయం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే జీవా గురుకుల ధ్యేయం. వేదాల సారాన్ని అనుసరిస్తే జీవన విధానంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. సామరస్య ధోరణి అలవడుతాయి. అనుభవజ్ఞులైన వేద పండితుల మార్గదర్శనంలో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– త్రిదండి చినజీయర్ స్వామిజీ
వేద వాజ్ఞయ పరిరక్షణ మన అందరి బాధ్యత. చినజీయర్ స్వామి సంకల్పానికి మా వంతు సహకారం అందించడం పూర్వజన్మ సుకృతం. ఎందరో వేద పండితులు ఇక్కడ తయారు అవుతున్నారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో వేద విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.
– రామేశ్వర్రావు, మైహోం అధినేత
వేద వాజ్ఞయ బోధన, శిక్షణే కాకుండా ఇక్కడ విద్యార్థులతో అధ్యయనం చేయిస్తున్నాం. విదేశాల్లో వేద పండితులతో ఘోస్టులు నిర్వహించి సమాజధార్మిక పరివర్తనపై చర్చా సదస్సులు నిర్వహిస్తున్నాం. శ్రీరామనగరం వేద విశ్వవిద్యాలయం భవిష్యత్ తరాలకు ఉజ్జల భవిష్యత్ ఇవ్వడంతో పాటు విశ్వ విఖ్యాతం చేయడమే స్వామిజీతో పాటు మా అందరి ఆకాంక్ష.
– జగపతి రావు, మై హోం ఎండీ