షాద్‌నగర్, ఫిబ్రవరి 22 : షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. త్వరలోనే నిర్మాణ పనులకు గుత్తేదారులను ఆహ్వానించేందుకు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం చటాన్‌పల్లి రైల్వే గేట్ నుంచి షాద్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వైపు, బుచ్చిగూడ రోడ్డు వైపులో రోడ్డు విస్తరణపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. సర్వే చేసి వివరాలను నమోదు చేశారు.
ఆర్అండ్బీ డీఈ బీఆర్ అర్జున వంతెన నిర్మాణ వివరాలను తెలిపారు. 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ ఉంటుందని, రైల్వే ట్రాక్‌పై నిర్మించే వంతెన 40 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తారని చెప్పారు.
షాద్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం రోడ్డు నుంచి రైల్వే గేట్ మీదుగా బుచ్చిగూడ రోడ్డు మార్గంలో వంతెన నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వంతెనపై భారీ వాహనాల రాకపోకలతో పాటు ఇరువైపులా ఫుట్‌పాత్ సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. వంతెనకు అనుసంధానంగా శ్రీనగర్ కాలనీ నుంచి చటాన్‌పల్లి రోడ్డు వైపు అండర్ పాస్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. వంతెన నిర్మాణంతో పాటు సాధారణ రోడ్లను అభివృద్ధి చేస్తామని, ఇరువైపులా విద్యుత్ లైన్ల ఏర్పాటు, మురుగు కాలువల నిర్మాణం వంటి వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రోడ్డు విస్తరణపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నెల రోజుల్లో టెండర్లను పిలుస్తామని చెప్పారు. వంతెన నిర్మాణానికి ఇప్పటికే రూ.95 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రోడ్డు విస్తరణపై స్థానిక నివాసితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ సూచన మేరకే విస్తరణ పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.