ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 25 ; రంగారెడ్డి జిల్లాలో వానకాల వరి కోతలు ముమ్మరమయ్యాయి. వడ్లు ఇండ్లకు చేరుతున్నాయి. అయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించా లో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 45 కేం ద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటిని ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోని మంచాల, యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, కందుకూరు, షాద్‌నగర్, కడ్తాల్, షాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, నందిగామ, శంకర్పల్లి తదితర మండలాల్లో ఈ ఏడాది వరిపంటను అధికంగా సాగుచేశారు.
జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో వరి సాగు..
జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.38 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేయ గా.. 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వర్షాలు ముందుగానే కురియడంతో అన్నదాతలు వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరం కాగా ఆయా మండలాల్లో 25 నుంచి 30 శాతం పంటను రైతులు కోసి కల్లాల్లో నిల్వ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే తరువాయి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, కొనుగోలు కేంద్రాలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాల్లేవని తెలుస్తు న్నది. సన్నరకం పంటకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్ర భుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ పంటను రైతులు అత్యధికంగా సాగుచేశారు. కాగా పంట చేతికందే సమయంలోనే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాక పోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. వచ్చే నెలలో కొనుగోలు కేం ద్రా లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
45 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు రంగారెడ్డి జిల్లాలో 45 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఐకేపీ, డీసీఎంఎస్, సహకార సంఘాల ద్వారా వరి పంటను కొనాలని నిర్ణయించారు. మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, షాద్‌నగర్ తదితర మండలాల్లో అధికంగా ఏర్పాటు చేయాలని భా విస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లకు క్వింటాల్‌కు రూ.2320తో పాటు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని కొనేందుకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
మరో పదిహేను రోజులు..
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు మరో పదిహేను రోజు ల సమయం పట్టే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా వాటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పదిహేను రోజులంటే.. అప్పట్లోగా జిల్లాలో వరి కోతలు పూర్తైయ్యే అవకాశం ఉందని అన్నదాతలు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే మద్దతు ధర వస్తుందని, లేకుంటే దళారులకు విక్రయించాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ప్రభుత్వం విఫలం
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ముమ్మరమయ్యాయి. మరో పదిహేను రోజుల తర్వాత కొనుగోలు కేంద్రా లను ప్రారంభిస్తే అన్నదాతలకు ఎలాంటి లాభం ఉండదు. అప్పటి వరకు జిల్లాలో కోతలు పూర్తవుతాయి. ఇండ్లలో నిల్వ చేసుకునే అవకాశం లేని వారు దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా కేంద్రా లను ఏర్పాటు చేస్తే అన్నదాతలకు మద్దతు ధర లభిస్తుంది.
-బూడిద నర్సింహారెడ్డి, రైతు
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కేసీఆర్ హయాంలో అక్టోబర్ నెలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధా న్యాన్ని కొనేది. కానీ, రేవంత్ సర్కారు ఇంకా జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరకు దళారులకు తమ పంటను అమ్ముకుంటున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలనుఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. -అచ్చన శ్రీశైలం