రంగారెడ్డి, జూలై 31 (నమస్తే తెలంగాణ) : మొన్న రూ.లక్ష.. నిన్న లక్షన్నర.. రుణమాఫీ విషయంలో అవే కొర్రీలు.. అవే తిప్పలు. మొదటి విడుతలో ఏ కారణాలతో రుణమాఫీకి దూరమయ్యారో.. అవే కారణాలతో రెండో విడుతలోనూ మెజార్టీ రైతులకు రుణ విముక్తి కలగలేదు. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,700 మంది రైతులకు రూ.258.18కోట్ల రుణమాఫీ, రెండో విడుతలో 22,915 మందికి రూ.218.12 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది.
అయితే అంకెలు మారాయి కానీ.. మాఫీ విషయంలో మాత్రం అందరి వెతలు ఒకేలా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఎప్పటిలాగే.. రైతులు రెండో విడుత రుణమాఫీ తర్వాత కూడా వ్యవసాయ అధికారుల వద్దకు, బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. సైట్లో లాగిన్ అయి చెబుతామని అధికారులు చెబుతున్నప్పటికీ రైతుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.
డీసీసీబీ బ్యాంకులో కొంతమందికే..
రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 34వేల వరకు ఉండగా..ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో కేవలం 11,700 మంది రైతుల పేర్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన 22వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రెండో విడుత జాబితాలోనూ డీసీసీబీ బ్యాంకుల్లో మొక్కుబడిగానే రుణమాఫీ జరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు పరిధిలో 11 మందికే రుణవిముక్తి కలిగింది.
దీంతో మిగతా రైతులకు మొండిచెయ్యి చూపినట్లేనా? అన్న భావన రైతుల్లో కలుగుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని, భార్యాభర్తలిద్దరినే కుటుంబ సభ్యులుగా పరిగణించాలని, వేరుగా ఉంటున్న కుమారులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. కొద్దిమందికే మాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దని రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతున్నది.
అవే కొర్రీలు.. అవే తిప్పలు..
ఇదీ.. రైతుల ఆవేదన..