జిల్లాలో రైతుభరోసాకు ప్రభుత్వం ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తున్నది. సాగుకు యోగ్యంకాని భూములంటూ 50,200 ఎకరాలకు కోత విధించడంతో సుమారు 25 వేల మంది రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోని రైతులకు సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందేది. అయితే, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రైతుభరోసా సక్రమంగా ఇవ్వకపోగా.. అర్హుల సంఖ్యను కొర్రీలు పెట్టి తగ్గిస్తున్న ది. జిల్లాలో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున ప్లాట్లుగా మారాయి. ఇటీవల అధికారులు పలుమార్లు సర్వే చేసి సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించారు. అయితే శివారులో భూములను ప్లాట్లుగా మార్చినా వాటికి పాస్‌బుక్కులు వచ్చాయి. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలతోపాటు షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, మహేశ్వరం వంటి ప్రాంతాల్లోని పలు వెంచర్లలో అమ్ముడుపోని భూముల్లో ఆయా పంటలను సాగు చేస్తుండగా.. వాటిని సాగుకు యోగ్యం కావని భావించి అధికారులు రైతుభరోసా జాబితా నుంచి తొలగించారు. దీంతో జిల్లాలో వేలాదిమంది రైతులు రైతుభరోసాకు దూరం కానుండడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7.80 లక్షల సాగు భూములు..
జిల్లాలో గత బీఆర్ఎస్ హయాంలో 7,80,000 ఎకరాలను సాగుభూములుగా గుర్తించి వాటికి రైతుబంధు అందేది. దీంతో 3,20,000 మంది కి లబ్ధి చేకూరేది. అయితే, రేవంత్ సర్కార్ సాగుకు యోగ్యంకాని భూములంటూ 50,200 ఎకరాలకు కోత విధిస్తుండడంతో 7,29,800 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందనున్నది.
సాగుకు సాయమేది..
జిల్లాలో రైతుభరోసా కోసం ప్రభుత్వం వడపోత అనంతరం అర్హులుగా గుర్తించిన రైతులకు కూడా సకాలంలో పెట్టుబడి సాయాన్ని అందించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్త్తున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నప్పటికీ రైతుభరోసా అందక పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు మధ్యదళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు.
కేసీఆర్ హయాంలో సకాలంలో రైతుబంధు..
గత కేసీఆర్ హయాంలో పెట్టుబడి సాయం పంటల సాగుకు ముందే ఠంచన్‌గా అందేది. దీంతో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంటలను సాగు చేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వగ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవించారు. కాగా, ప్రస్తుతం పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అర్హులందరికీ అందించాలి
గత కేసీఆర్ ప్రభుత్వం అందించిన మాదిరిగానే అర్హులందరికీ కాంగ్రెస్ సర్కార్ కూడా రైతుభరోసా అందించి ఆదుకోవాలి. గతంలో సకాలంలో పెట్టుబడి సాయం రావడంతో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంటలను సాగు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళారులను ఆశ్రయించి అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారు.
-మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు