Jaggareddy | హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని నియమించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఆయన చిట్‌చాట్ చేసిన సందర్భంగా జగ్గారెడ్డిని పీసీసీ చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆయన మాస్ లీడర్ అని, మరో పీజేఆర్‌గా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయనకు ఆ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తంచేశారు. మంత్రి కోమటిరెడ్డి పీసీసీ పదవిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటనే చర్చ జరుగుతున్నది.
మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మంత్రి పరోక్షంగా డిమాండ్ చేశారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. లేనిపక్షంలో ఇప్పుడు అసందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 2024 సెప్టెంబర్‌లో నియమితులయ్యారు. ఇప్పటికి ఏడాదిన్నర కాలం అవుతున్నది. ఈ పదవీకాలం మూడేండ్లపాటు ఉం టుంది. ఒకవేళ అధిష్ఠానం అండదండలు ఉం టే మరికొంత కాలం పెరుగొచ్చు లేదా మరొకరిని ఎన్నుకోవచ్చు. సాధారణంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఇంకా ఏడాదిన్నర పాటు పదవీకాలం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంత ముందుగా పీపీసీ అధ్యక్షుడి ఎంపికపై కోమటిరెడ్డి ఎందుకు స్పందించారు? అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.