ఓటు అత్యంత విలువైనది.. దానిని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. అందులో భాగమైన సర్(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటరు నమోదు చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఈనెల 24వరకు కొనసాగనున్నది. ఈలోగా ఓటర్లు తమ ఫారాలను నింపి బీఎల్వోలకు అందించాలి. గడువులోగా ఫారాలను ఇవ్వకుంటే ఓటు హక్కు గల్లంతయ్యే అవకాశముంది. ‘సర్’పై గురువారం ఆయన నమస్తేతెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
-రంగారెడ్డి, జూలై 9 (నమస్తే తెలంగాణ)
నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఎంతశాతం పూర్తయ్యింది?
కలెక్టర్ : ‘సర్’ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99 శాతం పూర్తయ్యింది. బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఫారాలను నింపే ప్రక్రియపైనా వారికి అవగాహన కల్పించారు. జిల్లాలో 36,99,743 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. వారిలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,73,372, రాజేంద్రనగర్‌లో 6,35,283, ఎల్బీనగర్లో 6,08,203 చొప్పున ఓటర్లు ఉన్నారు.
నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఎన్యూమరేషన్ ఫారాలను ఎప్పటిలోగా తిరిగి ఇవ్వాలి?
కలెక్టర్ : ఓటు నమోదులో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిచేసి ఇవ్వటం అత్యంత కీలకం. ఆ ఫారాలు తీసుకున్న వారందరూ ఈనెల 24లోపు పూర్తిచేసి బీఎల్వోలకు ఇవ్వా లి. ఈనెల 24లోపు ఫారాలు నింపి ఇవ్వని వారు ఓట్లు కోల్పోయే అవకాశముంటుంది. ఓటర్లంతా దీనిని దృష్టిలో ఉంచుకుని ఫారాలను నింపి త్వరగా ఇచ్చేయాలి.
నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఫారాలు నింపేందుకు ఓటర్లకు సహకరిస్తున్నారా?
కలెక్టర్ : ఎన్యూమరేషన్ ఫారాలను నింపటంలో అవగాహన లేనివారి కోసం ప్రతి పోలింగ్‌బూత్‌లో రెండు చొప్పున హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాం. ఫారాలను నింపటంలో ఇబ్బందిగా ఉన్నవారు ఈ డెస్క్‌లను సంప్రదిస్తే అక్కడను న్న సిబ్బంది పూర్తిచేసి ఇస్తారు. ఈ డెస్క్‌ల్లో బీఎల్వోలు, ఐకేపీ, గ్రామపంచాయతీ కార్యదర్శుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం.
నమస్తే తెలంగాణ ప్రతినిధి : నింపిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభించారా?
కలెక్టర్ : ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని నింపి ఇచ్చిన వారి పత్రాలను కంప్యూటర్లో ఎంట్రీ చేస్తున్నాం. బుధవారం నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పటివరకు జిల్లాలో 7 శాతం పూర్తయ్యింది. ఈ ప్రక్రియను రోజురోజుకూ మరింత వేగవంతం చేస్తాం. ప్రజలు నింపిన ఫారాలను వెంటనే సిబ్బంది సంబంధిత యాప్‌లో డిజిటలైజేషన్ చేస్తున్నారు.
నమస్తే తెలంగాణ ప్రతినిధి : సర్ ప్రక్రియ పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు…?
కలెక్టర్ : ‘సర్’ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికీ అవసరమైన మేర ప్రత్యామ్నాయ సిబ్బందిని తీసుకుంటున్నాం. ఫారాలను నింపడం, పరిశీలించడం, డిజిటలైజేషన్‌కోసం ఉపాధ్యాయులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు, అదనపు సిబ్బంది, వలంటీర్ల సేవలనూ తీసుకుంటున్నాం.
నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఫారాలను ఎప్పటిలోగా అందించాలి, గడువులోపు అందించని వారు ఏం చేయాలి?
కలెక్టర్ : బీఎల్వోల నుంచి ఫారాలు పొందిన ఓటర్లు వాటిని నింపి ఈనెల 24లోపు తిరిగి బీఎల్‌వోలకే ఇవ్వాలి. ప్రతిరోజూ 20శాతం మేర ఫారాలను సేకరించేందుకు బీఎల్వోలు ఇతరత్రా సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరంతా ఫారాలు నింపటంలో ఓటర్లకు సహకరిస్తారు. గడువులోగా ఫారాలు నింపి ఇవ్వకపోతే దాదాపుగా ఓట్లు గల్లంతు అవుతాయి. అర్హులై ఉండి సకాలంలో ఫారాలు నింపి ఇవ్వని వారు 1987 ముందు పుట్టిన వారైతే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి ఫారాలు నింపి ఇవ్వాల్సి ఉంటుంది. 1987 నుంచి 2004 మధ్య పుట్టిన వారైతే దరఖాస్తుదారుడి తల్లిదండ్రుల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి నింపాల్సి ఉంటుంది.
నమస్తే తెలంగాణ ప్రతినిధి : ‘సర్’ ప్రక్రియపై ఓటర్ల స్పందన ఎలా ఉన్నది?
కలెక్టర్ : ‘సర్’ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా బీఎల్వోల ద్వారా ఇంటింటికెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందించాం. ఫారాలను అందించే క్రమంలోనే వాటిని ఎలా నింపాలనే దానిపైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఫారాలు నింపలేని వారి కోసం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశాం. దీంతో ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును పొందేందుకు ముందుకొస్తున్నారు. ప్రతిరోజూ పది నుంచి ఇరవైశాతం ఓటర్లు తమ ఫారాలను నింపి బీఎల్వోలకు ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నాం.