లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అదనపు జిల్లా సెషన్స్ జడ్జి 4 నెలల కాలంలో 22 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పులు వెలువరించటం సంచలనంగా మారింది. జడ్జి రవికుమార్ దివాకర్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 10 కేసుల్లో దోషులుగా తేలిన 22మందికి మరణశిక్ష విధించారు. 12 ఏండ్ల బాలుడి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ కొద్ది రోజుల క్రితం తీర్పు వెలువరించారు. వ్యాపారి కిడ్నాప్, హత్య, ఒక రైతు హత్య, హోంగార్డు హత్య, పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి హత్య..వంటి అత్యంత క్రూరమైన నేరాల్లో దోషులకు కఠిన శిక్షలు ఖరారు చేశారు. దీంతో ఆయన ఇప్పటివరకు తన ఉద్యోగ కాలంలో మొత్తం 35 మందికి మరణశిక్ష విధించటం గమనార్హం. 2022 లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశాలు జారీచేసి జడ్జి రవికుమార్ దివాకర్ దేశవ్యాప్త గుర్తింపు పొందారు.