హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో తెలంగాణ, ఏపీల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారినట్టు పేర్కొంది. తెలంగాణలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో మంచిర్యాలలో 1.77 సెంటీమీటర్లు, నిర్మల్లో 1.66 సెం.మీ, జగిత్యాలలో 1.51 సెం.మీ, ములుగులో 1.38 సెం.మీ, పెద్దపల్లిలో 1.30 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.