పరిగి, ఏప్రిల్ 6 : దళిత బంధు పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వారు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా చూడాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం దళిత బంధు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవంతం చేసేందుకు చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాలు వెంటనే తెరిపించి.. వారి ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వారందరితో ఖాతాలు తెరిపించినట్లు ఆమె చెప్పారు. ఇందులో 72 మంది లబ్ధిదారులకు వారు ఎంచుకున్న అసెట్స్‌ను అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాకు దళిత బంధు కింద మంజూరైన రూ.19.72కోట్లను రేపటి నుంచి వారి ఖాతాలకు జమ చేయనున్నామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లేశం పాల్గొన్నారు.