పరిగి, జనవరి 26 : 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలననుసరించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల మువ్వన్నె జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగిలోని పల్లవి విద్యాసంస్థల వద్ద ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, కొడంగల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఆయా శాఖల కార్యాలయాల వద్ద జిల్లా అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు ఎస్పీ రషీద్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి ఉన్నారు.
నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు
షాబాద్, జనవరి 26 : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చిందని, నాటి నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నామన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కిందిస్థాయి ప్రజల వరకు అందేలా చూడాలన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం నాంపల్లిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్, అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ కదివరన్ ఫళని, డీఆర్వో హరిప్రియ, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.