మొయినాబాద్, ఫిబ్రవరి 24 : దేవాలయాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని గురువారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ ఎంపీ రంజిత్‌రెడ్డితో మాట్లాడారు. ఆర్టికల్-363 హిందూ ఆలయాల పరిరక్షణ విధానాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయం లేవనెత్తిందన్నారు. ఆలయ వ్యవస్థ పునరుద్ధరణ, పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. స్పందించిన ఎంపీ రంజిత్‌రెడ్డి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి దేవతా హక్కుల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారు.