రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, మార్చి 5 : రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండల సమాఖ్యకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రెండు మండలాల సమాఖ్యలను జాతీయ ఉత్తమ సమాఖ్యలుగా ప్రకటించారు. జిల్లాలోని నందిగామ మండల సమాఖ్యతోపాటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండల సమాఖ్యను జాతీయ ఉత్తమ మండల సమాఖ్యలుగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. సంబంధిత మండల సమాఖ్యలోని స్వయం సహాయక సంఘాల పనితీరుతోపాటు ఆర్థిక, సామాజిక, వృత్తిపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ మండల సమాఖ్యగా ఎంపిక చేశారు. ప్రధానంగా మండల సమాఖ్య పరిధిలో బాల్యవివాహాలను అరికట్టడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర, డ్రాపౌట్ను తగ్గించి బడీడు పిల్లలను బడిలో చేర్పించడం, పర్యావరణంపై అవగాహన కల్పించడం, పారిశుధ్యం, కొవిడ్ వ్యాప్తి నివారణలో మండల సమాఖ్యలోని గ్రామ సంఘాల నిర్వహణ, అదేవిధంగా కొవిడ్ వ్యాక్సినేషన్లో సంఘాల పాత్రను పరిగణనలోకి తీసుకొని నందిగామ మండల సమాఖ్యను ఉత్తమ మండల సమాఖ్యగా ఎంపిక చేశారు. జిల్లాలోని నందిగామతోపాటు మహేశ్వరం, మొయినాబాద్, చేవెళ్ల, తలకొండపల్లి, కందుకూరు మండల సమాఖ్యలు పోటీపడగా, నందిగామ మండల సమాఖ్య అన్నింటిలోనూ పనితీరు బాగుండడంతో ఎన్ఆర్ఎల్ఎం(జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్) ఉత్తమ సమాఖ్యగా ఎంపిక చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నందిగామ మండల సమాఖ్య సభ్యులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర ఉత్తమ మండల సమాఖ్య అవార్డును అందజేయనున్నారు.
నందిగామ మండల మహిళా సమాఖ్యలో 29 గ్రామ సంఘాలు, 601 స్వయం సహాయక సంఘాలు, 6763 స్వయం సహాయక సభ్యులున్నారు. జిల్లాలోని నందిగామ మండల మహిళా సమాఖ్య అన్ని అంశాల్లోనూ మిగతా మండల సమాఖ్యల కంటే యాక్టివ్గా పనిచేస్తున్నది. సంబంధిత మండల సమాఖ్యలోని మెజార్టీ గ్రామ సంఘాలన్నీ ఏ, బీ, సీ గ్రేడుల్లోనే ఉన్నాయి. 142 సంఘాలు ఎంటర్ప్రైజెస్ను, 24 గ్రామసంఘాలు రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఎంఎంఎస్ గ్రేడింగ్ల్లోనూ నందిగామ మండల సమాఖ్య ఏ గ్రేడ్లో ఉంది. నందిగామ మండల సమాఖ్యలో 4 మహిళా ఉత్పత్తిదారుల సంఘాలుండగా 60 మంది సభ్యులున్నారు. నందిగామ మండల మహిళా సమాఖ్యకు ఈ ఆర్థిక సంవత్సరం 468 సంఘాలకు రూ.15.02 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 485 సంఘాలకు రూ.16.32 కోట్ల రుణాలను మంజూరు చేసింది. వడ్డీలేకుండా 397 సంఘాలకు రూ.92.35కోట్లు, స్త్రీ నిధికి రూ.2.80 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. జిమ్స్ దవాఖాన సహకారంతో సంబంధిత మండల పరిధిలో హెల్త్ క్యాంపులను కూడా నందిగామ మండల మహిళా సమాఖ్య నిర్వహించింది. నందిగామ మండల సమాఖ్యలోని సంఘాలన్నీ తీసుకున్న రుణాలన్నింటినీ ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఎన్పీఏ లేకుండా పనిచేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
– యాదగిరి, ఏపీఎం, నందిగామ మహిళా సమాఖ్య
జాతీయస్థాయి ఉత్తమ మహిళా సమాఖ్య అవార్డు నందిగామ మండల మహిళా సమాఖ్యకు దక్కడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనలను తప్పకుండా పాటిస్తూ ఎప్పటికప్పుడు తమకు విధించిన ప్రతి లక్ష్యాన్ని కష్టపడి పని చేశాం. జిల్లా అధికారులు, మండల మహిళా సమాఖ్య సభ్యుల సహకారం, అందరి కృషితోనే జాతీయస్థాయి అవార్డు వచ్చింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో తమకు సహకరించిన అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులకు ధన్యవాదాలు.
మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం : కొర్ర యాదమ్మ, నందిగామ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహిళా సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న కార్యక్రమాలను మహిళలకు వివరించి, వారికి రుణాలందించి ఏదైనా వ్యాపారం పెట్టించేలా అవగాహన కల్పించడం.. వ్యాపారాన్ని అభివృద్ధిచేసేలా ప్రతి రోజూ వారికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో భాగస్వాములమై మహిళలను అర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. మండల సమాఖ్యకు జాతీయస్థాయి అవార్డు రావడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేసి, నందిగామ మహిళా సమాఖ్యకు మంచి గుర్తింపు తీసుకువస్తాం.
– విజయ, మహిళా సమాఖ్య సభ్యురాలు, నందిగామ
ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని కిరాణ షాపులు, లేడీస్ కార్నర్లు, డెయిరీ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి అనేక రకాల వ్యాపారాలు పెట్టుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. నందిగామ మహిళా సమాఖ్యలో రుణాలను తీసుకున్న సభ్యులు సరైన సమయానికి చెల్లిస్తున్నారు. సార్ వాళ్లు చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాం. మా మహిళా సమాఖ్యకు అవార్డు రావడం సంతోషంగా ఉంది.