షాద్‌నగర్, మార్చి 5 : రాష్ట్రంలో మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించే వేడుకల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేడు మహిళలు అకాశమే హద్దుగా ఎదుగుతున్నారని, వారి ఉన్నతికి సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలు, షీ టీంలు వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, రాష్ట్రంలోని 40.58 లక్షల మంది మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించారన్నారు.
నేడు సర్కారు పాఠశాలల్లో 10.90 లక్షల బాలికలు చదువుతున్నారని, రూ.400 కోట్ల నిధులను వెచ్చించి మోడల్ స్కూళ్లను నిర్వహిస్తున్నారని తెలిపారు. 1000 గురుకులాల్లో బాలికలకు ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తున్నారని చెప్పారు. నూతనంగా 53 మహిళా డిగ్రీ కళాశాలు అందుబాటులోకి వచ్చాయని, మహిళలకు ఉపాధి కల్పించేందుకు నాలుగు పారిశ్రామికవాడలను ఏర్పాటుచేశారని వివరించారు. రాష్ట్రంలో 10.27 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 10 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందాయని చెప్పారు. సర్కారు దవాఖానాల్లో 32 శాతం ప్రసవాలు గతంలో ఉంటే.. నేడు 52 శాతానికి పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవంలో భాగంగా అన్ని రకాల లబ్ధిదారులతో సెల్ఫీలు దిగాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళా కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.