షాబాద్, మార్చి 5 : అట్రాసిటీ కేసులను అలసత్వం వహించకుండా చార్జిషీట్లను త్వరితగతిన పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. 2022 సంవత్సరానికి నూతన కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరుగాలంటే, పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి చార్జిషీట్ ఫైల్ చేయాలన్నారు. లేకపోతే కేసులు రోజుల తరబడి పెండింగ్‌లో ఉండి బాధితులు నిరుత్సాహానికి లోనవుతున్నారని చెప్పారు. కేసు నమోదైన తదనంతరం ఎఫ్ఐఆర్తోపాటు బాధితుల ఆధార్‌కార్డు, బ్యాంకు వివరాలను కలెక్టరేట్‌కు సమర్పించాలని సూచించారు.
ఈ విషయంలో జాప్యం లేకుండా నివేదికలను సమర్పించినట్లయితే బాధితులకు పరిహారాన్ని సకాలంలో అందించేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రెండు సంవత్సరాల కాలంలో సైబరాబాద్ పరిధిలో 253 కేసులు, రాచకొండ పరిధిలో 157 కేసులు నమోదయ్యాయని.. అందులో సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో 87 కేసుల చొప్పున పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో 87 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటి పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నెలా అధికారులతో కేసుల పురోగతిపై సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 28 కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, సైబరాబాద్, రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారి శ్రీధర్, గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారి మోతి, మత్స్యశాఖాధికారి సుకీర్తి, ఆర్డీవోలతో పాటు సంబంధిత శాఖల అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.