ఆదిబట్ల, మార్చి4: ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం హరితశోభను సంతరించుకున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో ఉద్యానవనంలా మారింది. ఏపుగా పెరిగిన మొక్కలు అక్కడికి వచ్చే ప్రజలు, సందర్శకులకు నీడతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ పురపాలక సంఘం పరిధిలో 20 వేల మంది జనాభా ఉండగా, 15 వార్డులున్నాయి.
2018లో ఆదిబట్ల పురపాలక సంఘంగా మారింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో అధికారులు మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తూనే అప్పటికే పరిసరాల్లో ఉన్న చెట్లను నరికివేయకుండా కాపాడుతున్నారు. నాటిన మొక్కల్లో కొన్ని ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. మరికొన్ని పండ్లను ఇస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాటితో మున్సిపల్ ఆఫీసుకు కొత్తందం సంతరించుకుని, పచ్చని శోభతో కళకళలాడుతున్నది. పెద్ద వృక్షాలు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, ప్రజలకు నీడనిస్తున్నాయి. పెద్ద వృక్షాల కింద గ్రామాల్లో రచ్చబండ మాదిరిగా చేసిన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో కార్యాలయ పరిసరాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా జామ, అరటి, మామిడి, రాగి, మునగ వంటి వాటితోపాటు అలంకరణకోసం నాటిన మొక్కలు ఆకట్టుకుంటున్నాయి.
మున్సిపల్ కార్యాలయ గోడలపై ఏర్పాటు చేసిన చిత్రాలు చూపరులకు విజ్ఞానాన్ని అందించడంతోపాటు పరిసరాలకు కొత్తందాన్ని తీసుకొచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటించిన రాష్ట్ర చిహ్నాలపై అవగాహన కల్పించేందుకు గీసిన జమ్మి చెట్టు, తంగేడు పువ్వు, పాలపిట్ట, జింక తదితర చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు హరితహారం ప్రాధాన్యాన్ని తెలిపేలా గీసిన చిత్రం అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతోనే కార్యాలయానికి కొత్తం దం వచ్చింది. కార్యాలయానికి వచ్చి న సందర్శకులు వాటి నీడన సేదతీరుతున్నారు. ప్రతి మొక్కనూ సంరక్షిస్తు న్నాం. కొన్ని మొక్కలు పండ్లను కూడా ఇస్తున్నాయి. కార్యాలయ గోడలపై ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అమరేందర్‌రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్