ఆదిభట్ల, జూన్ 18: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సీ నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలిస్తూ.. నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు.
భూభారతి చట్టంపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుంటే దరఖాస్తులను సకాలంలో, సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూభారతి చట్టంలోని నిబంధనలను తూ.చా తప్పకుండా పాటిస్తూ, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న మండలాల్లో వెంటనే పరిశీలించి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకుని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.