వికారాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైన వెంటనే ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలకు బ్యాలెట్ బాక్సులతోపాటు సరిపోను బ్యాలెట్ పేపర్లను పోలింగ్ కేంద్రాలకు సమకూర్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది కూడా శనివారం సాయంత్రమే ఆయా గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తుతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 175 గ్రామపంచాయతీలు, 1520 వార్డులుండగా.. 20 గ్రామపంచాయతీలు, 294 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, 155 గ్రామపంచాయతీలు, 1226 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 510 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3164 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. 2,22,457 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, వీరిలో పురుషులు 1,10,291., మహిళా ఓటర్లు 1,12,165., ఇతరులు ఒక్కరు ఉన్నారు.
వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వికారాబాద్, ధారూరు, బంట్వారం, మోమిన్‌పేట్, నవాబుపేట్, కోట్‌పల్లి, మర్పల్లి మండలాల్లో 1226 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించడంతోపాటు పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 1100 మంది పోలీసులతోపాటు 150 మంది స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రంగారెడ్డి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఆదివారం జరుగనున్న మలిదశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అందులో 13 పంచాయతీలు, 232 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 165 పంచాయతీలు, 1,308 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 499 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల కోసం 2003 మందిని పోలింగ్ అధికారులుగా, 2,588మందిని అసిస్టెంట్ పీవోలుగా ప్రభుత్వం నియమించింది. ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు డీపీవో సురేశ్‌మోహన్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల తర్వాత లెక్కింపు ఉంటుందన్నారు.

