కరోనాతో ఓ వైపు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నా.. కేంద్రం కక్ష కట్టి రావాల్సిన నిధులు ఇవ్వకపోయినా.. తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమంలో రాజీపడడం లేదు. అందులో భాగంగానే ఈ ఏడాది వానకాలానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని రైతులందరికీ రైతుబంధు పంపిణీ పూర్తి చేసింది. ఎప్పటిలాగే దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. మొత్తం 3,14,814 మంది రైతులకు రూ.319.18కోట్ల సాయాన్ని అందించింది. ప్రతి సీజన్‌కూ క్రమం తప్పకుండా సాయం అందుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసే బాధ తప్పడంతో ఎలాంటి రంది లేకుండా సాగు పనులు చేసుకుంటున్నారు.
-రంగారెడ్డి, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : గత ఉమ్మడి పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకంతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్నారు. 2018 సంవత్సరం నుంచి రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టి నేటికీ నిర్విఘ్నంగా సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఆరంభంలో ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలు ఇచ్చిన సర్కారు 2019-20 నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేల చొప్పున ఇస్తూ వస్తున్నది. కేంద్రం కక్ష కట్టినప్పటికీ.. ఓ వైపు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఏడాది వానకాలం సీజన్‌కు ముందే రంగారెడ్డి జిల్లాలోని 3,14,814 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయించి గత జూన్ 26 నుంచి మొదలుపెట్టారు. రూ.319.18కోట్ల సాయాన్ని సంపూర్ణంగా అందించి రైతుల తర్వాతే మరేదైనా అని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. గత 11 విడుతల్లో రంగారెడ్డి జిల్లా రైతాంగానికి పెట్టుబడి సాయం అక్షరాలా రూ.3,337.04కోట్లను అందించి రైతు బంధువుగా రైతుల గుండెల్లో నిలుస్తున్నారు. ప్రతి సీజన్‌కు క్రమం తప్పకుండా సాయం అందించి పెట్టుబడి ఇబ్బందులు తీరుస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతు కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
‘ధరణి’తో పారదర్శకంగా సాయం..
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు చేకూరిన లాభం అంతా ఇంతా కాదు. రైతులకు ఇబ్బందికరంగా మారిన అనేక సమస్యలను సీఎం తనదైన శైలిలో చెక్‌పెట్టి వారిక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వ్యవసాయ భూముల లెక్కలు తికమకగా ఉండేవి. భూమి ఉన్నప్పటికీ చాలామంది రైతులకు రైతు బంధు సాయం అందేది కాదు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా చిక్కుముడులతో కూడిన అనేక సమస్యలకు ధరణితో ప్రభుత్వం పరిష్కారం చూపింది. ధరణి వచ్చాక భూముల కొనుగోలు, అమ్మకాల్లో రైతులకు ఎదురవుతున్న రిజిస్ట్రేషన్ తంతులో అవినీతికి చెక్ పడింది. భూకబ్జాదారుల అక్రమాలకు అడ్డుకట్టవేసి అసలైన వ్యక్తులకే భూ పట్టాలు దక్కేలా చేశారు. ఈ పోర్టల్ ఆధారంగానే రైతు బంధు సాయాన్ని క్రమ పద్ధతిలో అర్హులందరికీ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి.
నాడు దండగ.. నేడు పండుగ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పగ్గాలు చేపట్టిన నాటి నుంచే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బ లోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నారు. సీజన్‌కు ముందే విత్తనాలు, ఎరువులను సైతం సిద్ధంగా ఉంచుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు దండగ అన్న వ్యవసాయం నేడు జిల్లాలో పండుగలా సాగుతున్నది.
సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు
అందరికీ అన్నం పెట్టే అన్నదాత రైతు అయితే… వారిని ఆదుకునే సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. ఇంతకు ముందు ఏ సీఎం కూడా ఆర్థిక సాయం అందించింది లేదు.. రైతు బాగుపడింది లేదు. పంటలు వేసే కాలం వస్తే రైతులు సావుకారి వద్ద అప్పులు తెచ్చుకునే వారు. అలాంటి పరిస్థితుల నుంచి సీఎం కేసీఆర్ రైతులను బయట వేశారు. ఆయన అన్నదాతలకు ఆప్తుడు. కేసీఆర్ మళ్లీ సీఎంఅవుతారు.
– ఆకుల రమాదేవి, వెంకటాపూర్, మొయినాబాద్
రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శం
తెలంగాణలోని రైతాంగ సమస్యలను కండ్లార చూసిన సీఎం కేసీఆర్… ప్రత్యేక రాష్ట్రంలో రైతులు ఎలాంటి కష్టాలు పడరాదనే సంకల్పంతో ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నేడు ఎంతోమంది రైతుల జీవితాలను కాపాడుతున్నది. రైతులను ఆదుకుంటున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతారు.
– మునీర్, కప్పాడు, ఇబ్రహీంపట్నం
పెట్టుబడి తిప్పలు తప్పినాయి
గతంలో వ్యవసాయం చేసేందుకు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చేవా ళ్లం. పండిన పంట మొత్తం తెచ్చిన అప్పుల వడ్డీకి సరిపోయేవి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి రైతుబంధు ఫథకంతో పెట్టుబడి సాయం అందిస్తుండడంతో పెట్టుబడి తిప్పలు తప్పింది. పండించిన పంట మొత్తం మా ఇంట్లోకి వస్తుండటంతో చాల సంతోషంగా ఉంది. రైతు బంధు పథకంతో మా కష్టాలు తీరాయి. సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధుతో మాకు అందుతున్న సాయం జీవితంలో మరిచిపోలేం. జీవి తాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. మళ్లీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించుకుంటాం.
– రమేశ్, రైతు, విఠ్యాల, ఫరూఖ్‌నగర్ మండలం
సంతోషంగా వ్యవసాయం
యావత్తు రైతాంగాన్ని కండ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దైవసమానులు. ఇలాంటి గొప్ప నాయకుడు మనకు సీఎంగా ఉండడం ఎంతో అదృష్టం. రైతులు పంటల సాగు మొదలు పంట పండించి కొనుగోలు వరకు అం డగా ఉంటూ ఆదుకుంటున్నారు. గతంలో రైతులకు ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయి ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
– కాయితి మోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి సభ్యుడు, ఇబ్రహీంపట్నం
రైతులకు సీఎం కేసీఆర్ దేవుడు
రైతులకు సీఎం కేసీఆర్ ఎన్నో సమస్యలను తీరుస్తున్న దేవుడు. నాకు 10 ఎకరాలు భూమి ఉంది. రైతు బంధు సాయం ఏడాదికి రూ.లక్ష నా బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నది. ఆ డబ్బులను వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగిస్తున్నాను. తెలంగాణ లోని రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజతలు. ఆయన చేసిన పెట్టుబడి సాయం జీవితంలో మరువలేం. జీవితాంతం రుణపడి ఉంటాం.
– సత్తయ్య గౌడ్, నల్లచెరువు, మాడ్గుల మండలం
రైతు బంధుతో ఎంతో ధీమా
‘రైతు బంధు’ రైతులకు ఎంతో ధీమాగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. రైతులకు మొదటి నుంచి పెద్ద పీట వేస్తున్నారు. పంట పెట్టుబడి సాయంతో ఎంతో ధీమాతో పంటలు సాగు చేస్తున్నాం. నాకు రైతు బంధు సాయం అందింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎదిరె శ్రీశైలం, రైతు, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల మండలం
రైతు బంధుతో ఎంతో మేలు
సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు పథకంతో పంట పెట్టుబడి తిప్పలు తప్పుతున్నాయి. గతంలో పంట పెట్టుబడికి పైసలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం పెట్టుబడి తిప్పలు లేదు. 24గంటలు విద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు. ఆయన చేసిన సహాయం జీవితంలో రైతులు ఎవరూ మరువలేరు.
– జంగ రాములు, రైతు, జంగోనిగూడ, నందిగామ
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రైతులకు సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తాం.
– శివరాజ్ కుమార్, జనవాడ, శంకర్పల్లి మండలం
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. రైతుల కష్టాలు తెలిసిన ప్రజా నాయకుడు. రైతులు పెట్టుబడి కోసం షావుకారుల దగ్గర వడ్డీలకు అప్పులు తెచ్చి మిత్తీలు కట్టలేక ప్రాణాలు కోల్పోయిన రైతులు ఎంతో మంది ఉన్నారని గ్రహించారు. అలాంటి బాధలు రైతులు పడొద్దనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. నాకు 3 ఎకరాల భూమి ఉంది. సంవత్సరానికి నా ఖాతాలో రూ.30 వేలు పెట్టుబడి సాయంగా పడుతున్నది. పెట్టుబడి సాయం అందుతున్నప్పటి నుంచి రైతులు అప్పులు చేయడం లేదు. పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయిస్తున్నారు. పంట దిగుబడి రాగానే మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడంతో మంచి లాభాలను చూస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ సాయాన్ని రైతులందరూ హర్షిస్తున్నారు.
– నేనావత్ దేశ్య, సాకిబండ తండా, ఆమనగల్లు మున్సిపాలిటీ