అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఎడతెరిపి లేని వర్షంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లు తడిసి ముద్దవుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ, ఈసీ వాగు లు, కాగ్నా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడా పంట పొలాలు నీట మునిగాయి.
పట్టణాలు, పల్లెల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా స్తంభించిం ది. ఆదివారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సరాసరి 86.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిగామలో అత్యధికంగా 137.2 మి.మీ.ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లోనూ ఆశించిన మేరలో వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు మేలు చేకూర్చేలా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. కంటిపై కునుకులేకుండా చేస్తున్న వర్షాలతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. వర్షం నీటి తో పలు చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలో ని మూసీ, ఈసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
చెరువులు, కాల్వల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతున్నది. అక్కడక్కడా పంట పొలాలు సైతం నీటి మునిగాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాం తాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో వర్షానికి మల్లేశ్ అనే వ్యక్తి ఇల్లు కూలింది.
కొందుర్గు మండలంలోని విశ్వనాథ్‌పూర్, తంగేళ్లపల్లి గ్రామాల మధ్య వాగు ఉప్పొంగడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఫరూఖ్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి, చించోడు గ్రామాల మధ్య వాగు ఉధృతం గా ప్రవహిస్తుండడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల, లింగంధన, ఏలూరు గ్రామాల మధ్య, నందిగామ మండలంలోని అంతిరెడ్డిగూడ, నర్సప్పగూడ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, కందులు, ఆముదం, జొన్న వంటి పంటలకు ఈ వర్షాలు అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైనా విపత్తు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు. ఉధృతంగా వర్షం నీరు పారే ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం విధిగా ఒక అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంప్రదించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 040-23237 416ను అందుబాటులో ఉంచారు. ముంపు ముప్పు ఉన్న ప్రాం తాల ప్రజలను ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశారు. వ్యాధులు ప్రబలకుండా, తాగునీరు కలుషిత కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవ డంతోపాటు, అన్ని పీహెచ్‌సీల్లో మందు లు అందబాటులో ఉండేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టింది.
రంగారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం
శంకర్పల్లి : 84.8
శేరిలింగంపల్లి : 67.7
గండిపేట : 68.7
రాజేంద్రనగర్ : 54.7
బాలాపూర్ : 66.6
సరూర్‌నగర్ : 58.3
హయత్‌నగర్ : 67.7
అబ్దుల్లాపూర్‌మెట్ : 73.6
ఇబ్రహీంపట్నం : 77.4
మంచాల : 81.8
యాచారం : 79.3
మాడ్గుల : 70.8
ఆమనగల్లు : 123.2
తలకొండపల్లి : 134.0
కేశంపేట : 134.2
కడ్తాల్ : 97.7
కందుకూర్ : 77.5
మహేశ్వరం : 81.9
శంషాబాద్ : 59.2
మొయినాబాద్ : 70.7
చేవెళ్ల : 99.4
షాబాద్ : 113.8
కొత్తూరు : 90.5
నందిగామ : 137.2
ఫరూఖ్‌నగర్ : 105.7
కొందుర్గు : 85.7
చౌదరిగూడ : 78.8
మత్తడి దుంకుతున్న చెరువులు, ప్రాజెక్టులు
వికారాబాద్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వికారాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారి మత్తడి దుంకుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి రోడ్లపై పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ వర్షానికి వికారాబాద్ అనంతగిరి కొండల్లో వాటర్‌ఫాల్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. వికారాబాద్ పట్టణంలో వరద నీరు ఉధృతంగా పారడంతో వికారాబాద్ నుంచి గెరిగెట్పల్లి వెళ్లే రోడ్డును పోలీసులు నిలిపేశారు.
శివసాగర్ చెరువు నిండి అలుగు పారుతున్నది. ధన్నారం, చిట్టంపల్లి వాగులు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గోధుమగూడ రైల్వేబ్రిడ్జి వద్ద నీరు పారడంతో సర్పన్‌పల్లి, ధ్యాచారం, గొట్టిముక్కల గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయింది. అదేవిధంగా రాజీవ్ గృహకల్పలో వాన నీరు వెళ్లేందుకు సరైన కాల్వలు లేకపోవడంతో రోడ్ల పక్కన ఉన్న హోటళ్లలోకి నీరు చేరింది. గృహకల్పలోని పలు ఇండ్లల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డా రు.
కొత్తగడి, బూర్గుపల్లి, కామారెడ్డిగూడ, గోధుమగూడ గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ధారూరు మండలంలోని రుద్రారం, నాగసముందర్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా పారడంతో పోలీసులు రాకపోకలను నిలిపేశారు. ఆ ప్రాంతాన్ని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీవో వాసుచంద్ర, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎస్ఐలు పరిశీలించారు. మర్పల్లి మండలంలోని సిరిపురం, తిమ్మాపూర్ వాగులు, బంట్వారం మండలంలోని నూరుల్లాపూర్ వాగులు వరద నీటితో ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కాగ్నా, కాకరవేణి నదులు ఉధృతంగా పారడంతో తాండూరులోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లో కి నీరు చేరింది. పెద్దేముల్ మండలంలో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. దోమ మండలంలోని పెద్ద చెరువులోకి వర్షపునీరు చేరడంతో మత్తడి దుంకుతున్నది. బొంరాస్‌పేట మండలంలోని మదన్‌పల్లి సమీపంలో చిన్న వాగు ప్రాజెక్టు అలుగు పారుతుండగా.. అటువైపు వచ్చిన ఓ లారీ ఆ వాగులో పడిపోయింది. పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.
కొడంగల్‌లోని పెద్ద చెరువు కాల్వ తెగడంతో పంట పొలాల్లోకి నీరు చేరింది. జాతీయ రహదారి పనులతో కొడంగల్, మహబూబ్‌నగర్ రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతంగా పారుతున్న వరద నీటిని కలెక్టర్ ప్రతీక్‌జైన్ పరిశీలించారు. మరో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీ 08416242136 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో నమోదైన వర్షపాతం
మండలం : మి.మీటర్లు
చౌడాపూర్ : 94.5
కోట్‌పల్లి : 65.3
బంట్వారం : 47.9
వికారాబాద్ : 79.1
బషీరాబాద్ : 106.4
పూడూరు : 73.2
మోమిన్‌పేట : 99.7
యాలాల : 107.1
తాండూరు : 102.2
దోమ : 94.2
దుద్యాల : 96
పెద్దేముల్ : 72.4
కొడంగల్ : 122.6
దౌల్తాబాద్ : 109.2
కులకచర్ల : 104.1
పరిగి : 40.1
మర్పల్లి : 34.2
ధారూరు : 80.4
బొంరాస్‌పేట : 88.4
నవాబుపేట : 81.8