ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా పంటలు నీట మునగగా పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలతోపాటు మూసీ, ఈసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షంతో పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు గ్రామాల్లోని రోడ్లు ధ్వంసం కాగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమ గోడును పట్టించుకునే వారు లేరని పంట నష్టపోయిన రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో అపార నష్టం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో అపారమైన నష్టం వాటిల్లింది. వివిధ శాఖల అధికారులు నష్టం లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. వర్షంతోపాటు ఈదురు గాలులకు 30కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, 29 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 107 విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. షాద్నగర్-అయ్యవారిపల్లి రోడ్డు, కొందుర్గు- కొల్లూరు రోడ్డు, వెలమల తండా-తంగేడుపల్లి రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, జరిగిన నష్టం మాత్రం ఇంతకంటే ఎక్కువగానే ఉన్నది.
చాలా ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోకిలాలో విల్లాలు జలమయంలో చిక్కుకున్నాయి. చౌదరిగూడెం మండలం చెగిరెడ్డి ఘనపూర్ గ్రామంలో ఎగువ నుంచి వరద రావడంతో పత్తి, వరి, జొన్న పంటలు నీట మునిగాయి. మొయినాబాద్ మండలంలోని అండాపూర్ వద్ద ఈసీ వాగు పంట పొలాల నుంచి పారడంతో సుమారు 100 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేవెళ్ల మండలంలోని అంతారం, హస్తేపూర్ తదితర గ్రామాల్లో వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో రాంరెడ్డి అనే రైతుకు చెందిన బంతితోట పూర్తిగా నీట మునిగింది.
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు నీటి పాలవ్వడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటివరకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఎవరూ రాలేదని, మా బాధలు వినేవారే కరువయ్యారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పరిసరాలన్నీ చిత్తడి చిత్తడిగా మారడంతో పొంచిఉన్న వ్యాధులపై జిల్లా ప్రజానీకం ఆందోళన చెందుతున్నది. పారిశుధ్యం మెరుగుపర్చేందుకు సంబంధిత శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన రంగారెడ్డి కలెక్టర్..
ఉస్మాన్ నగర్లోని లోతట్టు ప్రాంతాల్లో సోమవారం కలెక్టర్ శశాంక పర్యటించారు. ఇక్కడి ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్యాంకుల నుంచి సరఫరా అయ్యే తాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపును నిర్వహించడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారికి సూచించారు.
చినుకుపడితే చాలు విద్యుత్తు అంతరాయం
చినుకు పడితే చాలు కరెంట్ పోతున్నది. కురుస్తున్న వర్షాలకు చేవెళ్ల పట్టణ కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో దోమల బెడదతో పసిపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్తు అధికారులు స్పందించాలి.
– పెంజర్ల అనంతరెడ్డి, చేవెళ్ల గ్రామం
వాన పడితే.. నరకయాతనే..
ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలోని సూర్యోదయ కాలనీకెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. కురుస్తున్న వానలకు ఈ రోడ్డు బురదమయంగా మారింది. వాహనదారులు, పాదచారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పం దించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి.
– చిన్నెల్లి మహేశ్, రాయపోల్ సూర్యోదయకాలనీ, ఇబ్రహీంపట్నం రూరల్
వరి, గులాబీ తోట నీట మునిగాయి..
ఈసీ వాగు వరద వచ్చి వరి పంట, గులాబీ తోట పూర్తిగా మునిపోయింది. పూల తోటను సాగు చేసుకుంటూనే జీవిస్తున్నాం. వరి, గులాబీ తోటకు కలిపి సుమారు రూ. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలి.
– నల్ల తిరుపతిరెడ్డి, అందాపూర్, మొయినాబాద్
కరెంట్ ఉండడం లేదు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరెంట్ పోతూ.. వస్తున్నది. ఒక క్షణం కూడా ఉండడం లేదు. నరకం అనుభవిస్తున్నాం. విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారమిస్తే.. సమస్యను పరిష్కరిస్తామంటున్నారు కానీ ఇప్పటికీ చర్యలు శూన్యం. ఇప్పటికైనా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలి.
– ఎదిరె శ్రీశైలం, దేవుని ఎర్రవల్లి, చేవెళ్ల
రోడ్లపైనే మురుగు నీరు..
తాండూరు పట్టణంలోని ఆదర్శతులసీనగర్లో వర్షం పడితే నీరు ఎక్కడికక్కడే నిలుస్తున్నది. మురుగు, వర్షం నీరు వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నాం. రోడ్ల కంటే ఎత్తుగా మురుగు కాల్వలు ఉండడంతో నీరు రోడ్లపైనే నిలుస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వర్షం పడితే ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
– మైల్వార్ శ్రీనివాస్, ఆదర్శతులసీనగర్
నీటి కుంటలా మిత్రానగర్
మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో మిత్రానగర్ నీటికుంటలా మారింది. ఎప్పు డు ఏం జరుగుతుందోనని భయమేస్తున్నది. పలుమార్లు అధికారులు, పాలకులకు కాలనీలో నిలుస్తున్న నీరు, మురుగు గురించి ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. ము ఖ్యంగా చిలుక వాగుపై అక్రమ నిర్మాణాలు ఏర్పాటు కావడంతోనే మిత్రానగర్ నీటి కుంటలా మారింది. తాండూరులోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.
– మల్లమ్మ, మిత్రానగర్, తాండూరు
ఇంట్లో లేని సమయంలో కూలింది..
ఎవరూ లేని సమయంలో ఇల్లు కూలడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఆ ఇంట్లో నేను నా భర్త మాత్రమే ఉంటాం. ఆ ఇల్లు చాలాకాలం కిందట నిర్మించింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు నీటితో తడిసి రాత్రి ఒక్కసారిగే కుప్పకూలింది. ప్రస్తుతం మాకు ఉండేందుకు చోటేలేదు. ఉన్న ఇల్లు పూర్తిగా ప డిపోయింది. అధికారులు స్పందించి త్వరగా నష్టపరిహారాన్ని అందిస్తే.. ఆ డబ్బుతో గూడును ఏర్పాటు చేసుకుంటాం.
– మలాన్బీ, బాధితురాలు రుద్రారం
భారీ వర్షాలతో పంటలకు నష్టం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న
వర్షాలతో పంట పొలాల్లో నీరు చేరి పంటలన్నీ పాడవుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వరి, కంది, పత్తి పంటల్లోకి భారీగా నీరు చేరింది. ఆరుగాలం కష్టపడి సమయానికి మందులు, ఎరువులు వేసి కాపాడుకుంటున్న పంటలు కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నాశనమయ్యాయి నాలాంటి ఎంతోమంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
-కుర్వ భిక్షపతి , రైతు, నాగులపల్లి, పెద్దేముల్
నష్టపరిహారం చెల్లించాలి..
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి, పత్తి, కంది పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతినాయి. కష్టపడి సాగు చేసిన పంటలు నీటిలో మునిగి పోయాయి. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
– రాంచందర్, రైతు, గిర్మాపూర్, పెద్దేముల్
రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం..
హయత్నగర్, మొయినాబాద్ :2.6మి.మీ
సరూర్నగర్ :1.8మి.మీ
శేరిలింగంపల్లి :1.3మి.మీ
బాలాపూర్ :1.2మి.మీ
గండిపేట :1.0మి.మీ
అబ్దుల్లాపూర్మెట్, రాజేంద్ర నగర్:0.8మి.మీ
కడ్తాల్, చౌదరిగూడెం, శంకర్పల్లి: 0.5మి.మీ
యాచారం : 0.3మి.మీ
మహేశ్వరం: 0.2 మి.మీ
ఇబ్రహీంపట్నం : 0.1మి.మీ