Chevella | చేవెళ్ల టౌన్,ఫిబ్రవరి 15 : ఆర్అండ్బీ అధికారులు మొద్దు నిద్ర వీడాలని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ సూచించారు. చేవెళ్ల డివిజన్లోని అన్ని గ్రామాల రోడ్ల మరమ్మత్తులు వీలైనంత తొందరగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో అల్లి దేవేందర్ మాట్లాడుతూ.. చేవెళ్ల డివిజన్లోని అన్ని గ్రామాల రోడ్లు పూర్తిగా గుంతలమయం అయ్యాయని అన్నారు. కానీ ఆ రోడ్ల మరమ్మతులను ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శించారు. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడం వల్ల వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో కంటి చూపు కోల్పోవడమే కాకుండా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోడం లేదని అరోపించారు.
రోడ్ల మరమ్మతుల కోసం 10 కోట్లకు పైగా నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగిందని అల్లి దేవేందర్ గుర్తు చేశారు. రోడ్ల మరమ్మతులకు డబ్బులు మంజూరైన ఆర్అండ్బీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టలేరని ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం పార్టీ అధ్వర్యంలో ఆర్అండ్బీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, ట్రాన్స్ పోర్టు యూనియన్ చేవెళ్ల మండల అధ్యక్షులు కిష్టయ్య, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వెంకటయ్య, సురేశ్, మాల సురేశ్, శ్రీనివాస్, కుమార్ తదితరులు ఉన్నారు.