రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) ; వానొచ్చింది.. వరదొచ్చింది.. చెరువుల్లోకి నీరొచ్చింది. కానీ..ఉచిత చేప పిల్లల జాడే లేదు. మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా..? లేనట్లా..? అన్న అనుమానాలను మత్స్య కారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినా.. చేప లను చెరువుల్లో వదిలేసరికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. అప్పట్లోగా వానకాలం ముగుస్తుంది. ఇక చేపలు ఎదిగేందుకు అవసరమైన నీళ్లూ ఉండకపోవచ్చు. టెండర్లతో ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్న 9,136 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి విషయంలో ఆందోళన చెందుతున్నాయి.
మిషన్ కాకతీయ పథకంతో చెరువులను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. అం దులో భాగంగానే ఏడాది పొడవునా వారికి జీవనోపాధి కల్పించి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. 2016-17లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ..గడిచిన ఏడేండ్లలో 6.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేసింది. ఇందుకోసం రూ.4.40 కోట్ల వరకు ఖర్చు చేయగా.. 41,753 మెట్రి క్ టన్నుల చేపల ఉత్పత్తితో రూ.56.59 కోట్ల ఆదాయం సమకూరింది. జలాశయాల్లో ఉచితంగా వదిలిన బొచ్చ, రాహు, బంగారు తీగ, రొయ్య, ముల్లంగి తదితర చేపలతో మత్స్యకారులు ఏడాది పొడవునా ఉపాధిని పొందారు. చేపలు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయ్యాయి. చేప పిల్లలను వేటాడేందుకు వలలు, రవాణా కోసం ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను అందజేసింది. అలాగే మహిళా సహకార సంఘాలకు విరివిగా రుణాలను మంజూరు చేయడంతో పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వహించి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకున్నది. గత ప్రభుత్వం కల్పించిన భరోసాతో మత్స్యకారుల జీవితాల్లో పెనుమార్పులొచ్చాయి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.
ఆనాటి పండుగ సందడేదీ..
జిల్లావ్యాప్తంగా 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 978 చెరువులున్నాయి. వీటి పరిధుల్లో 186 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా..అందులో 9,136 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేవారు. కానీ..ఈసారి ఆ సందడి ఎక్కడా లేకుండా పోయింది. చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు టెం డర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇన్ టైంలో చేప పిల్లలను పంపిణీ చేస్తారా? లేదా..? అన్న దానిపై అధికార వర్గాల నుంచీ స్పష్టత లేదు. గతంలో ప్రతి ఏటా చేప పిల్లల పంపిణీని జూలైలోనే పూర్తి చేసేవారు. ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆగస్టు మొదటి వారంలో ఈ తంతు పూర్తి అయ్యేది. ఇందుకోసం ప్రభుత్వం ఏప్రిల్ నుంచే సన్నాహాలు మొదలు పెట్టేది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80 ఎంఎం నుంచి 100 ఎంఎం సైజు చేప పిల్లలను.. చెరువులు, కుంటల్లో పెంచేందు కు 35ఎంఎం నుంచి 400ఎంఎం సైజులో ఉండే చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసేది. అయితే ఈసారి ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
గతేడాది బిల్లులు చెల్లించక పోవడంతోనే..!
ఈ ఏడాది జిల్లాలోని 813 చెరువుల్లో కోటీ93 లక్షల చేప పిల్లలను వదలాలని జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ మేరకు అధికారులు గత జూలై 10న టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. చివరి తేదీని 23 కు పొడిగించినా ఫలితంలేదు. దీంతో గడువును ఆగస్టు 13కు పెంచి ముచ్చటగా మూడోసారి టెండర్లు పిలిచినా గుత్తేదార్ల నుంచి స్పందన రాలేదు. నాలుగోసారి టెండర్లు పిలిచిన ప్రభుత్వం బిడ్ దాఖలుకు ఈనెల 19 వరకు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ నెల వచ్చినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో మత్స్యకారుల్లో ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి కొంతమేర వరద చేరింది. చేప పిల్లల విడుదలకు ఇదే అనువైన సమ యం. అయితే ఆలస్యంగా చేప పిల్లలను వదలడంవల్ల చేపలు ఎదిగేందుకు ఆలస్యమై మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అయితే టెండర్లు దాఖలు కాకపోవడానికి పెండింగ్ బిల్లులే కారణమని తెలుస్తున్నది. గతేడాది వదిలిన చేప పిల్లలకు సంబంధించిన బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం ఇంకా గుత్తేదార్లకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే.. టెండర్లో పాల్గొంటామని గుత్తేదార్లు స్పష్టం చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఈసారి కూడా బిడ్ దాఖలు చేయకపోతే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..! అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
ఈ ఏడాది జీవనోపాధి ఎట్లా..
మత్స్యకార కుటుంబాలు చాలావరకు చేపల వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాయి. ఈసారి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టకపోవడంతో జీవనోపాధి ఎట్లా..? అని వారు మదనపడుతున్నారు. గతంలో సెప్టెంబర్ నాటికే పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లతో కాలయాపన చేయ డం తగదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి చెరువుల్లో చేపపిల్లలను వదలడం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధిని చూపాలి.
-గుండు సురేశ్, మత్స్య పారిశ్రామిక