ఇబ్రహీంపట్నం, జూలై 13: గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సానిటేషన్ కార్యక్రమం నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల పాలన ముందుకు సాగించారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఇంటింటికి చెత్తసేకరణ బుట్టలతో పాటు ఇంటింటికి వచ్చి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారాచెత్తను సేకరించేవారు.
కాని ప్రస్తుతం ఇదంతా కనిపించటంలేదు. ఇండ్లల్లో చెత్త పేరుకుపోతుంది. ఇంటింటికి ట్రాక్టర్ రావటంలేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసి దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మంచాన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో చూద్దామన్న చెత్త కనిపించేది కాదని, ప్రస్తుతం మళ్లీ వెనుకటకాలం వచ్చిందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మురుగుకాల్వలను శుభ్రం చేయటం, పిచ్చిమొక్కలు తొలగించటం, దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ చేయటంతో పాటు ఇతర పారిశుధ్య పనులకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించేవారు.
ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేకాధికారులు గ్రామాలవైపు కన్నెత్తి కూడా చూడటంలేదని ఆరోపణలొస్తున్నాయి. గ్రామాల్లో సమస్యలున్నా పట్టించుకునే నాథుడే లేడని, గతంలో ఏ సమస్య ఉన్నా సర్పంచ్‌కు చెప్పేవారమని, ప్రస్తుతం ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని, ప్రత్యేకాధికారులకు ఫోన్‌చేసినా పట్టించుకోవటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
దోమలు, ఈగల స్వైర విహారంతో ప్రబలుతున్న వ్యాధులు..
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం పడకేసింది. మురుగునీటి రోడ్లపై పారుతుండటంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోవటంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులతో మంచాన పడుతున్నారు. పారిశుధ్యంపై పట్టించుకోవల్సిన ప్రత్యేకాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని సుమారు 87 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినప్పటికి వారు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని అయోమయ స్థితిలో రోగాల భారీన పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానాల్లో అందుబాటులో లేని మందులు..
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విషజ్వరాలు ప్రబలుతుండటంతో పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానాకు వెల్తున్నప్పటికి సరైన మందులు, వైద్యచికిత్సలు అందటంలేదని ఆరోపిస్తున్నారు. విషజ్వరాలు వస్తే ప్రైవేటు దవాఖానాకు వెలితే సరైన వైద్యం అందటంలేదని, ప్రైవేటుకు వెలితే ఇష్టానుసారంగా డబ్బులు గుంజుతున్నారు. దీనిని పట్టించుకుని ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాల్లో సరైన మందులతో పాటు వైద్య చికిత్సలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
రోగులకు అందుబాటులో లేని మందులు..
గత ప్రభుత్వ హాయాంలో వర్షాలు ప్రారంభం సమయంలో దోమలు, ఈగలు విజృంభించకుండా కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలకు ఎలాంటి రోగాలు దరిచేరకుండా దోమలు, ఈగలను ఆదిలోనే అంతం చేయించారని బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు విమర్శించారు. అనుకోని పరిస్థితిలో రోగాలభారీన పడి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రోగులకు సరిపడా మందులను స్థానిక సర్కారు దవాఖానాల్లో అందుబాటులో ఉంచారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో సర్కారు దవాఖానాకు పోవాలంటేనే ప్రజలు జంకుతున్నారు. నేటికి అందుబాటులో మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు.