వికారాబాద్, ఏప్రిల్ 2 : ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. వారిపై లాఠీచార్జి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వ భూములను అమ్మవద్దని చిలుక పలుకులు పలికి, ఇప్పుడు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం దుర్మార్గమన్నారు. కేసీఆర్ హయాంలో గ్రీన్ కవరేజ్ పెరిగి, ప్రపంచంలోనే హైదరాబాద్ గ్రీన్ సిటీగా గుర్తింపు పొందిందన్నారు. కేసీఆర్ పాలనలో హరితహారం జరిగితే, రేవంత్ పాలనలో హరిత సంహారం జరుగుతున్నదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ కవరేజ్, భూగర్భజలాలు తగ్గడం చూస్తూ ఉంటే, భావితరాలకు సహజ సంపదను దూరం చేయడమే అనిపిస్తున్నదని తెలిపారు. పరిపాలన చేతగాక, చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు, ఈ విధమైన చర్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా తరపున ఆయన డిమాండ్ చేశారు.