వికారాబాద్, మే 24 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు ధన్నారంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వాడుకకు నీళ్లు లేకపోవడం మహిళలు అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఉన్న రెండు బోర్లు చెడిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో మున్సిపల్ అధికారులు కాలనీవాసులకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.
అవి ఊడా అరకొరగానే అందుతుండడంతో.. మహిళల మధ్య ప్రతిరోజూ నీటికోసం చిన్న పాటి యుద్ధమే జరుగు తున్నది. అయినా సరిపడా నీరు అందడంలేదని పలువురు పేర్కొంటు న్నారు.
ఇంకా ఎన్ని రోజులు తాగునీటి కోసం అవస్థలు పడాలని అధికారులపై మండిప డుతున్నారు. మా ఇబ్బందులను గుర్తించి నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కోరుతున్నారు.
కొడంగల్, మే 24 : దుద్యాల మండలంలోని ఆలేడ్వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గత నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఇం ట్లోకే పుష్కలంగా నీళ్లు వచ్చేవని.. గత నాలుగు రోజులుగా ఖాళీ బిం దెలతో పొలాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు జరుగుతుండడంతో వాడుకకూ నీళ్లు లేక చాలా ఇబ్బంది అవుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. పొలాల్లోని బోరు, బావుల వద్దకు వెళ్తే భూగర్భజలాలు తగ్గిపోయాయని.. పొలానికే నీళ్లు సరిపోవడం లేదని కొందరు అక్కడికి రానివ్వడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్‌కు మరమ్మతులు చేయించి తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు రావడంతో తాగునీటి ఎద్దడి తీరిందని సంతోషపడ్డాం. కానీ, గత నాలుగు రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో కాలనీకి దూరంగా ఉన్న ఒక బోరు నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. బోరు దూరంగా ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉన్నది. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి.
-అమృతమ్మ, ధన్నారం
గత నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పొలాల్లోని బోర్ల వద్దకు పనులు మానుకుని వెళ్లాల్సి వస్తున్నది. మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య నెలలో రెండు మూడు సార్లు వస్తున్నది. వాడుకకూ నీళ్లు లేక చాలా ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
– వెంకటమ్మ, ఆలేడ్ గ్రామం. కొడంగల్
గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. కాలనీలో బోరు మోటర్ ఉన్నా పాడైపోయి నిరుపయోగంగా మారింది. దీంతో ఉదయమే కాలనీకి దూరంగా ఉన్న బోరు వద్దకు ఖాళీ బిందెలతో వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తున్నది. అధికారులు బోరుకు మరమ్మతులు చేయించి ఉంటే నీటి తిప్పలు తప్పేవి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఎద్దడిని తీర్చాలి.
-యశోద, ధన్నారం, వికారాబాద్.