యాచారం, జూలై 28 : మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య రోజురోజుకూ రెట్టింపవుతున్నది. 4జీ నుంచి 5జీకి దేశం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో గ్రామాలు, గిరిజన తండాల్లో సిగ్నల్ సమస్య ప్రజలను వేధిస్తున్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో ప్రజలకు అనేక రకాల సేవలు ఇంటర్నెట్తోనే అందుతున్నాయి.
ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లకు నెట్వర్క్ ఎంతో కీలకంగా మారింది. అయితే మండలంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ రాకపోవడంతో వినియోగదారులు జియో, ఎయిర్టెల్ వైపు మొగ్గు చూపారు. అయితే ఇటీవలి కాలంలో జియో సిగ్నల్ సైతం దారుణంగా తయారైంది. 5జీ సేవలని గొప్పలు చెప్పినా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. ఈ సమస్య పింఛన్ల పంపిణీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది.
సిగ్నల్ సక్రమంగా రాకపోవడంతో పింఛన్ పంపిణీ చేసేందుకు పోస్టుమెన్ పట్టుకుంటున్నారు. పింఛన్ ఇచ్చే సమయంలో సిగ్నల్ లేక లబ్ధిదారుల వేలిముద్రలను మిషన్ తీసుకోకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. దీంతో పింఛన్ మిషన్లను పట్టుకొని రోడ్ల వెంట సిగ్నల్ కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. సమీపంలో ఎత్తుగా ఉన్న ప్రాంతాలకెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు.
మండలంలో గత వారం రోజులుగా ఇదే దుస్థితి నెలకొన్నది. దీంతో లబ్ధిదారులు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసి అలసిపోతున్నారు. ఒక్కో పోస్టుమన్ మేజర్ గ్రామపంచాయతీతోపాటు వాటి అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల్లోనూ పింఛన్లను అందజేయాలి.
సిగ్నల్ రాక పింఛన్ డబ్బులను సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో జఠిలంగా ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మేడిపల్లి గ్రామంలో ఇదే సమస్య తలెత్తడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల్లో సిగ్నల్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
కొన్ని రోజులుగా తిరుగుతున్నా..
పింఛన్ డబ్బుల కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నా. అదేదో సిగ్నల్ రాక ఆలస్యమవుతున్నదంటా. ఉదయమే వెళ్లి పోస్టుమన్ దగ్గర కూర్చుండి నిరీక్షించినా ఫలితం ఉండడం లేదు. సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో నాకు డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వం స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యల్లేకుండా చేయాలి. ఆ పైసలతోనే నాకు కావాల్సిన వస్తువులు, మందులు కొనుకుంటా.
-రాములమ్మ, మేడిపల్లి
సిగ్నల్ సామర్థ్యాన్ని మెరుగుపర్చాలి..
సిగ్నల్ సమస్యను పరిష్కరించి పింఛన్ పంపిణీలో ఎలాంటి ఆటంకాల్లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మండలంలో అన్ని నెట్వర్క్ల సిగ్నల్ సామర్థ్యాన్ని పెంచాలి. సిగ్నల్ లేక పింఛన్ లబ్ధిదారులు, పోస్టుమెన్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండలంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు పూర్వ వైభవం తీసుకురావాలి. ప్రతినెలా పింఛన్ డబ్బులను సకాలంలో లబ్ధ్దిదారులకు అందేలా తగిన చర్యలు చేపట్టాలి.
-కాళ్ల జంగయ్య, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు