కొడంగల్, జనవరి 29 : ఏడాదిలోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదో ప్రజలకు అర్థమైందని, చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండడంతో ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం లగచెర్ల కేసు నిమిత్తం బొంరాస్‌పేట పోలీస్‌ష్టేషన్‌కు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ విత్తనాలు విత్తే సమయంలో రైతు భరోసా ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉండేదని, ఇప్పుడు అందించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాలను ప్రారంభించారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ప్రతి రైతుకూ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నీటిమూటలా మారిందని, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా చేతులు దులుపుకున్నదన్నారు. అదునుకు పెట్టుబడి సాయం అందజేయకుండా మార్చి 31వ వరకు అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఆరు గ్యారెంటీలంటూ హామీలిచ్చి ఏడాది దాటినా అతీగతి లేదన్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు గారడి చేస్తున్నారు తప్పా నిజం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతున్నదని, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు వినే పరిస్థితిలో జనం లేరన్నారు. కరోనా వంటి పరిస్థితిలోనూ కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించారన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇస్తానన్న కొత్త పింఛన్లు అమలుకు నోచుకోలేదని, కల్యాణలక్ష్మి తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. వడ్లకు బోనస్ అని బోగస్ మాటలు చెప్పారని, సీఎం ఓ మాట మాట్లాడితే, మంత్రులు మరో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, సీఎం అయితే అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. మండలానికో పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రావు యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్ల మహిపాల్, నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, బాబర్, మహేందర్‌రెడ్డి, ఫకీరప్ప, దేశ్యానాయక్, రవిగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.