హైదరాబాద్ నగరవాసులకు పాలను అందించడంలో రంగారెడ్డి జిల్లావాసులు ముందువరుసలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి నిత్యం లక్షలాది లీటర్ల పాలను నగరానికి తీసుకొస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సంతోషంగా ఉన్న పాడిరైతులు.. నేడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించడంతో పాటు సబ్సిడిపై పాడి పశువుల కొనుగోలు, దాణా, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి పాడి రైతులకు అండగా నిలిచింది. డెయిరీ ఫాంలను నెలకొల్పుకొనేందుకు బ్యాంకుల నుంచి రుణాలను ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో బిల్లులు రాక, ఖర్చులు పెరిగినా పాల ధర పెరుగక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిటాడుతున్నారు. దీనికి తోడు మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా పశువుల దాణా, పశుగ్రాసం ధరలు పెరిగాయి. రాష్ట్ర సర్కార్ స్పందించి ఆర్థికంగా అండగా నిలువకపోతే పాడిపరిశ్రమలను మూసి వేయాల్సిన పరిస్థితి దాపురించనున్నదని పాడి రైతులు పేర్కొంటున్నారు.
– రంగారెడ్డి, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/షాద్‌నగర్‌రూరల్
ప్రస్తుతం లీటరు పాల ధర రూ.40 నుంచి రూ.50 మాత్రమే ఉన్నది. ప్రభుత్వం పట్టించుకుని లీటరుకు రూ.60 నుంచి రూ.70 పెంచితే గిట్టుబాటు అవుతుందని రైతులు అభిప్రాయపడున్నారు. బిల్లుల చెల్లింపుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని రైతులు వాపోతున్నారు. 15 రోజులకు ఒకసారి రావాల్సిన బిల్లులు రెండు నెలలు గడిచినా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో నిత్యం 17వేల లీటర్ల పాల దిగుబడి వస్తున్నది. కొందుర్గు, ఎక్లాస్ఖాన్పేట్ బీఎంసీ సెంటర్లు ఉన్నాయి. 15రోజులకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లింపు రెండు నెలలైనా అందకపోవడంతో పాడి రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అమూల్, జెర్సీ, తిరుమల, విజయ, మస్కతి, దొడ్లపాలు వంటి సంస్థలు పాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ సంస్థలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. హైదరాబాద్ నగరానికి జిల్లా ఆనుకుని ఉండడంతో అధిక శాతం రైతులు పాలను తీసుకెళ్లి నగరంలో విక్రయిస్తున్నారు.
పెరిగిపోతున్న పశుగ్రాసం, దాణా ధరలు..
రోజురోజుకూ పశుగ్రాసం, దాణా ధరలు పెరుగుతున్నాయి. కానీ, పాల ధర మాత్రం పెరుగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్వింటాల్ దాణాకు రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.220 నుంచి రూ.250కి పెరిగింది. జిల్లాలో వరిపంట సాగు కూడా గణనీయంగా తగ్గడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది కింద ఉన్న ఖర్చు.. ఇప్పుడు రెట్టింపు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నదని జిల్లారైతులు ఆవేదన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, బ్యాంకు రుణాల్లో రాయితీ ఇచ్చి ఆదుకున్నదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాడి రైతులను పూర్తిగా విస్మరించిందని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు బిల్లులు చెల్లించాల్సి ఉన్నది..
నియోజకవర్గం నుంచి అనునిత్యం సుమారు 17వేల లీటర్ల పాలను సేకరిస్తున్నాం. ఇంకా కేవలం మూడు బిల్లులను మాత్రమే చెల్లించాల్సి ఉన్నది. త్వరలోనే వాటిని కూడా అందజేస్తాం. ప్రైవేటు కంటే అధిక ధరను కట్టిస్తున్నాం. బిల్లుల జాప్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు.
– సురేశ్, మేనేజర్ పాలశీతలి కేంద్రం షాద్‌నగర్
ధరలు పెరిగాయి..
పశుగ్రాసం, దాణా ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు తప్పా…లాభాలు రావడం లేదు. ప్రభుత్వం పాల ధరను పెంచాలి. పాడి పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నాం. బ్యాంకుల ద్వారా రాయితీపై లోన్లు ఇప్పించి ఆదుకోవాలి.
– వరప్రసాద్‌రెడ్డి, నజ్దిక్‌సింగారం
రాయితీపై లోన్లు ఇవ్వాలి..
పశుగ్రాసం, గడ్డి విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా రాయితీపై లోన్లు ఇప్పించి పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఖర్చులు పెరుగుతున్న కారణంగా పాల లీటరు ధరను రాష్ట్ర సర్కార్ పెంచాలి. లేదంటే డెయిరీ ఫాం నడపడం చాలా కష్టమే.
– సురేశ్
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో బిల్లులు వచ్చేవి. ప్రైవేటు సెంటర్లకు పాలు పోయకుండా విజయ డెయిరీ సెంటర్లోనే పోసేది. నేడు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. షాద్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించకుండా కేవలం రూ. 50 కోట్లను మాత్రమే విడుదల చేయడం బాధాకరం.
-చంద్రశేఖర్, పాడి రైతు, విఠ్యాల గ్రామం