పరిగి, మే 14 : పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రుక్కుంపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అయిదేళ్ల క్రితం కొత్తగా గ్రామపంచాయతీగా ఏర్పాటు కావడంతో తమ గ్రామాన్ని మరింత అభివృద్ది చేసుకోవచ్చని భావించి మొదటి ఎన్నికల్లో ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. అయిదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది. కాగా గత నాలుగు నెలల క్రితం రుక్కుంపల్లి గ్రామపంచాయతీని పరిగి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ సీడీఎంఎ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మున్సిపాలిటీలో విలీనమైన నాలుగు నెలల్లోనే గ్రామస్తుల కష్టాలు తీర్చేవారు కరువయ్యారు.
నీటి కోసం గంటల తరబడి రుక్కుంపల్లి గ్రామానికి మిషన్ భగీరథ నీరు కనీసం అరగంట సైతం రావడం లేదని వాపోతున్నారు. గ్రామంలో డైరెక్టర్ పంపింగ్ సిస్టమ్ ద్వారా నీటి సరఫరాకు సంబంధించి ఒక బోరు మోటర్ స్టార్టర్ కాలిపోయి రోజులు గడుస్తున్నా మరమ్మతుల పేరిట తీసుకువెళ్లి ఇప్పటివరకు బాగు చేయించలేదని తెలిపారు. ఓవైపు మిషన్ భగీరథ నీరు సరిపోకపోవడం, మరోవైపు సింగిల్ ఫేజ్ మోటర్లతో నీరందించే బోర్లలో నీటిమట్టం తగ్గిపోయింది. గ్రామస్తులు తాగునీటి కోసం సింగిల్ ఫేజ్ మోటర్ ఉన్న బోరు నీటినే వాడతారు. గత పదిహేను రోజులుగా ఈ బోరు ద్వారా నీరు సరిగ్గా రావడంలేదు. గ్రామంలోని మెజారిటీ ఇళ్ల వారు మంచినీటి కోసం ఒకే బోరు వద్ద గంటల తరబడి బిందెలతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ నీటి కష్టాలపై మున్సిపల్ అధికారులకు విన్నవిస్తే మిషన్ భగీరథ నీరు వస్తున్నాయి కదా, ఇంకేమి సమస్యంటూ దబాయిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో గ్రామపంచాయతీగా ఉన్నపుడు పంచాయతీ కార్యదర్శి రోజూ గ్రామానికి వచ్చేవారని, మున్సిపాలిటీలో విలీనం తర్వాత కొత్తగా వచ్చిన కార్యదర్శి విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో సైతం తెలియడం లేదని, ఇప్పటికైనా తమ గ్రామంలో మంచినీటి ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.
తాండూరు రూరల్ : వారం రోజులుగా తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి పంచాయతీతోపాటు అనుబంధ గ్రామమైన సంకిరెడ్డిపల్లితండాలోని గిరిజనులు మంచినీరు లేక అల్లాడుతున్నారు. దీనిపై మండల అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేతులేత్తేశారు. మిషన్ భగీరథ నీళ్ళు బంద్ కావడంతో ప్రజలకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. గతంలో సీఎం కేసీఆర్ చలవ కారణంగా మిషన్ భగీరథ పథకం ద్వారా 50 ఏళ్ల నీటి సమస్య తీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీటిని కూడా ఇవ్వలేకపోతున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని బోర్లు వట్టిపోయాయి. దీంతో దిక్కుతోచని ప్రజలు వ్యవసాయ బోర్లపై నీటి కోసం ఆధారపడుతున్నారు.
ఉదయం లేవగానే వ్యవసాయ బోర్ల వద్దకు క్యూ కడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రణీత్, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ తమ గోడు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. గ్రామానికి చెందిన కావలి జగదీశ్ తన సొంత నీటి ట్యాంకర్ ద్వారా సంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నాడు. సంకిరెడ్డిపల్లితండాకు జనుముల నందు తమ వ్యవసాయ బోరు నుంచి డైరెక్టుగా తండాలోకి పైపులైన్ ద్వారా గిరిజనులకు నీరు సరఫరా చేస్తున్నారు.
మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రణీత్‌తోపాటు పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ బుధవారం సంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. దారునవాగుతండా నుంచి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంచాయతీలో చిల్లిగవ్వకూడా లేదని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు. నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల రూరల్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ సరిపడా నీరు అందించి బిందెలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితిని రూపుమాపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పరిస్థితులే పునరావృతమవుతున్నాయంటే ప్రభుత్వం ఏవిధంగా పని చేస్తుందో ఇట్టే అర్థమవుతున్నది. ఎండాకాలం షురూ అవ్వకముందు నుంచే గ్రామాల్లో నీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. శంకర్పల్లి మండల పరిధి ఆలంఖాన్‌గూడ గ్రామంలో కూడా ఇదే రిపీట్ అవుతున్నది. నీటి ఎద్దడితో గ్రామస్తులు సతమతమవుతున్నారు.
మిషన్ భగీరథ పైపు లైన్లో లో ప్రెషర్‌తో సరఫరా అవుతుండడంతో సమస్య ఉత్పన్నమవుతున్నదని ఆలంఖాన్‌గూడ గ్రామస్తులు వాపోతున్నారు. అస్సలు నీరు సరిపడా రావడం లేదని, వచ్చిన నాలుగైదు బిందెలతోనే కాలం వెల్లదీస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ ఫీట్ లోతులో ఉన్న పైపు లైన్లపై భారీ వాహనాలు వెల్లడంతో లోపల జామై నీరు తక్కుగా వస్తున్నదని అంటున్నారు.
మా గ్రామంలో నీటి సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. చూస్తాం.. చేస్తాం అనుడే తప్పా ఎవరూ వచ్చింది లేదు. చేసిందీ లేదు. అధికారులు స్పందించి నీటి ఎద్దడిని నివారించాలి.
– దమ్మన్నగారి శివకుమార్‌రెడ్డి, ఆలంఖాన్‌గూడ, చేవెళ్ల సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ చైర్మన్