పరిగి, జూన్ 22 : మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైతే తమ దశ మారుతుందనుకుంటే అయిదు నెలలుగా చిరుద్యోగులకు కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు పేరుకే విలీనమైనా పంచాయతీరాజ్ ఉద్యోగులను మున్సిపల్ పరిధిలోకి మార్చకుండా పనిచేయిస్తుండడం గమనార్హం. వీటికితోడు విలీన గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ చూపడంలేదు.
2018లో పరిగి మున్సిపాలిటీగా ఏర్పడగా.. ఐదేండ్ల పదవీకాలం పూర్తైన తర్వాత 2025 జనవరి 28న అయిదు కిలోమీటర్ల పరిధిలోని ఆరు గ్రామాలు నస్కల్, శాఖాపూర్, రుక్కుంపల్లి, సుల్తాన్పూర్, నజీరాబాద్, సయ్యద్మల్కాపూర్లను పరిగి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు గ్రామాలకుగాను శాఖాపూర్లో కేవలం భూములు మాత్రమే ఉంటాయి. మిగతా అయిదు గ్రామపంచాయతీలు కాగా, అందులో పనిచేసే వర్కర్లను సైతం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చారు.
ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాత ఆయా గ్రామపంచాయతీలలోని రికార్డులను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామపంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల వివరాలను తీసుకొని ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో గత జనవరి 28 నుంచి ఆరు గ్రామాలు పరిగి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చాయి.
పరిగి మున్సిపాలిటీలో విలీనమైన అయిదు గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న కార్మికులు తమ గ్రామాల విలీనంతో తమకు ఠంచనుగా వేతనం వస్తుందని, అధికంగానే వేతనం రాబోతుందని ఆశించారు. కానీ మున్సిపాలిటీలో విలీనమై ఆరు నెలుల కావస్తున్నా ఇప్పటివరకు వారికి వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరం. నస్కల్ గ్రామపంచాయతీలో 8 మంది, రుక్కుంపల్లిలో ముగ్గురు, సయ్యద్మల్కాపూర్లో ముగ్గురు, నజీరాబాద్లో 7 మంది, సుల్తాన్పూర్ గ్రామపంచాయతీలో 6 మంది కార్మికులు మొత్తం 27 మంది పనిచేస్తున్నారు. వారికి ఇప్పటివరకు ఒక నెల వేతనం సైతం రాకపోవడం గమనార్హం.
గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులకు మార్చి నెల వరకు వేతనాలు వచ్చాయి. పనిచేస్తే కాని పూట గడవని కుటుంబాలకు చెందిన కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సగటు వేతన జీవికి ఒక నెల వేతనం ఆలస్యంగా వస్తేనే తల్లడిల్లుతారు. అలాంటిది పేద కుటుంబాలకు చెందిన చిరుద్యోగులకు వేతనాలు అందించడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆయా గ్రామాల్లో పారిశుధ్యం, ఇతర పనులు చేయిస్తున్నారు తప్ప వేతనాలు ఇవ్వడంలో ఆరు నెలల తాత్సారం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల కార్మికులకు వేతనాలు ఇస్తున్నట్లు తెలిసింది. పరిగి మున్సిపాలిటీలో ఎందుకు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా వెంటనే విలీన గ్రామాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో సమస్యలు యథాతథంగా ఉంటున్నాయి. ప్రధానంగా వీధి దీపాలు పని చేయకుంటే మరమ్మతు చేయించేవారు కరువయ్యారని, కొత్త వీధి దీపాల ఏర్పాటు ముచ్చటే లేదని ఆయా గ్రామాలవారు పేర్కొంటున్నారు. ఒక్కోసారి వీధి దీపాలు పనిచేయకుంటే పదిహేను రోజుల వరకు మరమ్మతు చేయించడం లేదని తెలిపారు.
అలాగే పారిశుధ్య సమస్య, దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్ సైతం చేయడం లేదని విలీన గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. తమ గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు సమస్యలను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. తమ గ్రామాల నుంచి ఆదాయం కావాలి కాని సమస్యలు పరిష్కరించరా అని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
విలీన గ్రామపంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శుల సమస్య మరోలా ఉన్నది. గతంలో మున్సిపాలిటీలోకి విలీనమైన గ్రామపంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీలో పనిచేస్తారా, లేక గ్రామపంచాయతీలో పనిచేస్తారా అని ఆప్షన్ అడిగి మున్సిపాలిటీలో పనిచేసేందుకు అంగీకరించిన వారిని వెంటనే మున్సిపల్ శాఖలోకి తీసుకొని, వారి సర్వీసును అలాగే కొనసాగించేవారు. పరిగి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామపంచాయతీల కార్యదర్శులు తాము మున్సిపాలిటీలో కొనసాగుతామని రాసిచ్చారు. ఈమేరకు గత ఆరు నెలలుగా వారు మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల్లోనే పనిచేస్తున్నా వేతనాలు పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్నారు.
పంచాయతీ కార్యదర్శులను మున్సిపల్ శాఖ పరిధిలోకి పంపించేందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకోకపోవడం, తమ దగ్గర సిబ్బంది సరిపోను లేరంటూ వారిని మున్సిపల్ శాఖ పరిధిలోకి పంపించేందుకు ఆలస్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కార్యదర్శులతో అనామకంగా పనిచేయించడం తప్ప పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించలేని పరిస్థితి నెలకొన్నది. తమ శాఖ పరిధిలోకి వస్తే వార్డు అధికారులుగా, ఇతర అధికారులుగా బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించవచ్చని, శాఖ పరిధిలోకి రానపుడు కచ్చితమైన పని చేయించలేకపోతున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.