జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లోని ఆశావహుల్లో హడావిడి మొదలైంది. కాగా, జిల్లాలో 531 గ్రామపంచాయతీలుండగా.. మొత్తం ఓటర్లు 7,63,665 మంది ఉన్నారు. వార్డులు 4710 ఉండగా.. 4,724 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే రిజర్వేషన్లపైనే ఉత్కంఠ నెలకొన్నది.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)
త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో పల్లెల్లో కోలాహలం నెలకొన్నది. ఆశావహులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుని తమ కార్యక్రమాలను మొదలెట్టారు. అయితే రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో వారిలో అయోమయం నెలకొన్నది. గతంలో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయా..? లేక మారుతాయా..? అన్న అంశంపైనే చర్చ జరుగుతున్నది. కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా, జిల్లాలో ని ఏ గ్రామంలో చూసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతున్నది.
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు పోగా ప్రస్తుతం జిల్లాలో 531 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లా శివారు ప్రాంతాలతోపాటు కొత్తూరు, షాద్‌నగర్, ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్లాయి. కొత్తగా చేవెళ్ల, షాద్‌నగర్‌లు మున్సిపాలిటీలుగా మారడంతో జిల్లాలో 19 మండలాలే మిగిలాయి. ఈ 19 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ గ్రామాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొన్నది. కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటిస్తారా..? లేదా గతంలో ఉన్న రిజర్వేషన్లనే కొనసాగిస్తారా..? అన్న అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఎన్నికల బరిలో ఉండేం దుకు సిద్ధమైన ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో తమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చిలో జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి ఊపందుకున్నది.
పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే 4710 వార్డులు, పోలింగ్ స్టేషన్లనూ గుర్తించాం. జిల్లాలో 7,63,665 మంది ఓటర్లుండగా..4,724 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాం. ఓటర్లకు అందుబాటులో ఉండేలా వాటిని ఏర్పాటు చేస్తాం.
-సురేశ్‌మోహన్, డీపీవో రంగారెడ్డి