రంగారెడ్డి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం లో గ్రామాల్లో ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా రిజర్వేషన్ల మాటే వినిపిస్తున్నది. మరోవైపు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తు న్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావొచ్చన్న ఉద్దేశంతో జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విందు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తా యా..? లేదా..? అనేది తెలియకముందే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కోసం యువత పెద్ద ఎత్తున ముందుకొస్తున్నది. జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పుంజుకోవడంతో ఈసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్దఎత్తున రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మంచాల, యాచారం, కందుకూ రు, అబ్దుల్లాపూర్మెట, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు, కొత్తూరు, కొం దుర్గు, కేశంపేట, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ వంటి 21 గ్రామీణ మండలాల్లో మున్సిపాలిటీలు మినహా మిగతా అన్ని గ్రామాలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగనున్నాయి.
జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో పోటీచేసే ఆశావహులు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానాలు తమకు అనుకూల రిజర్వేషన్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు. దీంతో ఉదయం నుంచి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ఆశావహులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో 21 జడ్పీటీసీలున్నాయి. ముఖ్యం గా అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, కడ్తాల్, మహేశ్వరం, కందుకూరు, షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి వంటి జడ్పీటీసీలకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశమున్న ది. ఎంపీపీ పదవి కోసం పోటీపడుతున్న పలువురు ఆ స్థానాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నిస్తున్నారు. అలాగే, గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు కూ డా తమకే అనుకూలంగా వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. కానీ, రిజర్వేషన్లపై ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.
ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావొచ్చన్న ప్రభుత్వ సంకేతాలతో ఆశావహులు విందు రాజకీయాలు మొదలుపెట్టారు. జిల్లా పరిధిలోని శివారు గ్రామపంచాయతీల్లో సర్పం చ్ పదవులకు తీవ్ర పోటీ నెలకొన్నది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయన్న ధీమాతో కొంతమంది ఉండగా.. రిజర్వేషన్లు తమను అనుకూలంగా రాకపోయినా తమను నమ్ముకున్న వారికి ఇచ్చి గెలిపించుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.