రంగారెడ్డి జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,25,456 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మొత్తం 38 కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా.. మరో నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.2060, సాధారణ గ్రేడ్‌కు రూ.2040 కనీస మద్దతు ధర చెల్లించనున్నారు.
షాబాద్/ఇబ్రహీంపట్నం, నవంబర్ 3 : వానకాలం సీజన్లో వేసిన వరిపంట కోతకు వస్తున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో వరిసాగును బట్టి దిగుబడి అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానకాలం సీజన్లో 1,25,456 ఎకరాల్లో రైతులు వరిపంటను సాగు చేసినట్లు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు పండించిన పంటను దళారుల చేతుల్లో పెట్టి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఈ నెల 2న జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నాలుగు రోజుల్లో జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 38 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఆమనగల్లు(కల్వకుర్తి), శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో ఈ ఏడాది వానకాలం సీజనల్లో రైతులు 11.25.456 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. వీటి సేకరణకు ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 38 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. పీఏసీఏస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 36 కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, ఐకేపీ ఆధ్వర్యంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక్కో నోడల్ అధికారి పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. మొత్తం 90వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12.50లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ధాన్యం సేకరణ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో వరికోతలు పెద్దఎత్తున మొదలు కానుండడంతో కేంద్రాలకు భారీ స్థాయిలో వరిధాన్యం రానుంది. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు
ధాన్యం అమ్మిన రైతుల వివరాలను నిత్యం ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చనున్నారు. సంబంధిత రైతుల బిల్లులను ప్రతిరోజూ జిల్లా కార్యాలయానికి సమర్పిస్తారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమచేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు తెలిపారు.
పారదర్శకంగా కొనుగోలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధిత రైస్‌మిల్లులకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలుచేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యాన్ని జియోట్యాగ్ విధానం ద్వారా సంబంధిత రైస్‌మిల్లుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలనుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టే అవకాశముండటంతో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు కూడా జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2060
ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఎఫ్‌సీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు చెబుతున్నారు. ఇందుకనుగుణంగా ఏ-గ్రేడు రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2060, సాధారణ రకానికి 2040 చెల్లించనున్నారు. ధాన్యంలో రాళ్లు, మట్టి పెల్లలు 1 శాతం, చెత్త, ఇతర ధాన్యపు గింజలు 1 శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 5 శాతం, పరిపక్వతకాని, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, తక్కువ మిశ్రమాలు 6 శాతం, తేమ 13 శాతానికి మించరాదని అధికారులు చెబుతున్నారు. కాగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన తమ ధాన్యం రైస్ మిల్లులకు చేరి, అక్కడ మిల్లర్లు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసిన 24 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. రైతులు ధాన్యం విక్రయించే ముందు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లతోపాటు ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సహకార సంఘాల ఆధ్వర్యంలో..
రంగారెడ్డిజిల్లాలోని సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆమనగల్లు, కడ్తాల్, ముద్విన్, చుక్కాపూర్, పడ్కల్, గట్టుప్పలపల్లి, రాంపూర్, వెల్జాల్, మేకగూడ, కొత్తపేట, తొమ్మిదిరేకులు, చేగూరు, షాద్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ, మహేశ్వరం, తలకొండపల్లి, కందుకూరు, మల్కారం, పాలమాకుల, యాచారం, మంతన్‌గౌరెల్లి, బాచారం, రాయపోల్, మంగల్పల్లిపటేల్గూడ, రాచకొండమైలారం, పోల్కంపల్లి కొనుగోలు సెంటర్లను ప్రారంభించనున్నారు.
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో..
బోడకొండ, ఆర్కపల్లి, నాగిళ్ల, ఇబ్రహీంపట్నం, కోహెడ, బండరావిరాల, నోముల, సర్దార్‌నగర్, ఐకేపీ ఆధ్వర్యంలో కూడా మరో రెండు సెంటర్లను ప్రారంభించనున్నారు.
ఇబ్రహీంపట్నం : పంటను కోసి ధాన్యం వేస్తున్న వరికోత మిషన్
సోమవారం నుంచి కేంద్రాలు సిద్ధం : శ్యామారాణి, రంగారెడ్డిజిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్
ఈ ఏడాది వానకాలంలో రైతులు సాగుచేసిన వరిపంటను సేకరించేందుకు జిల్లా వ్యాప్తంగా 38 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 90వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. 12.50లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉంటాయి. ఏ-గ్రేడ్‌కు రూ. 2060, సాధారణ రకానికి రూ. 2040 అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం విక్రయించిన వెంటనే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నాం.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర : మొద్దు అంజిరెడ్డి, రైతు ప్రతి సీజన్లో రైతులు నష్టాలపాలవకూడదనే సంకల్పంతో రైతులకు సరైన గిట్టుబాటుధర కల్పిస్తూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి లాభాలు గడించాలి. మధ్యదళారులను నమ్మి నష్టాలపాలవకూడదు.