Yacharam | యాచారం, మార్చి24 : మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి. బోరుబావులు క్రమక్రమంగా వట్టిపోతున్నాయి. సాగుకు సరిపడ సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎండి పోయిన పంటలను చేసేదేమిలేక రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట చేతికొచ్చే దశలో కళ్ల ముందే ఎండిపోయి పశువుల పాలు కావడంతో అన్నదాతలు లబోదిబో మంటున్నారు. ఇలాంటి ఘటనే మండలంలోని మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
మేడిపల్లి గ్రామానికి చెందిన సద్గుణాచారి అనే యువ రైతు తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో వరిపంట సాగు చేశాడు. మొదట్లో బోరు బాగనే పోసేది, కాని వర్షాలు లేకపోవడం, ఎండలు దంచికొట్టంతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి ఎద్దడి మొదలైంది. దీనికి తోడు విద్యుత్ కోతలు, లోఓల్టేజీ సమస్య అన్ని వెరసి చేతికొచ్చె పంట ఎండిపోయింది. ఇప్పటికే తనకున్న రెండెకరాల పంట నీరందక ఎండిపోయింది. దీంతో చేసేదేమిలేక పంట చేతికొచ్చే దశలో పశువుకు, జీవాలకు మేతగా వేస్తున్నాడు. పశువులను, జీవాలను వరిపంట పొలంలోకి తోలి మేపుతున్నాడు. నమ్ముకున్న పంట పశువుల పాలు కావడంతో తన ఆశలు ఆవిరి అయ్యాయని ఆవేదన చెందుతున్నాడు.
గత పదేళ్ల తరువాత సాగునీటి ఎద్దడితో తన పంటను కోల్పోయినట్లు రైతు సద్గుణాచారి తెలిపారు. చూస్తుండగానే కండ్ల ముందే వరి పంట ఎండిపోవడంతో ఎంతో బాధకు గురవుతున్నట్లు ఆయన తెలిపాడు. నీళ్లు లేక వరిపంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయాడు. గ్రామంలో నెలకొన్న కరువు కాటకాలతో తన శ్రమ, పెట్టబడి, సమయం అన్ని వృథాగా పోయాయని ఆయన వాపోయాడు. పంటలెండి పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి రైతులను ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరుతున్నాడు. లేదంటే రైతులంతా కలిసి ఆందోళనలను చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు.