వికారాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఓ ఎస్ఐ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఎస్ఐ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారినే టార్గెట్‌గా చేసి..ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఇద్దరు కానిస్టేబుళ్లకు సర్పంచ్ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు గాలం వేసే బాధ్యతను సదరు ఎస్ఐ అప్పజెప్పినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు గత వారం, పది రోజులుగా ఏయే గ్రామాల్లో ఎవరెవరు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారనే వివరాలను ఎస్ఐకి చేరవేయడంతోపాటు మీరు సర్పంచ్‌గా గెలవాలంటే మా సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ)ను కలవాలంటూ సర్పంచ్ అభ్యర్థులకు సూచిస్తున్నట్లు సంబంధిత ఠాణా పరిధిలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆ ఎస్ఐ డబ్బులిచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు పలు సూచనలు, సలహా లు ఇస్తున్నట్లు.. డబ్బులివ్వని వారిని బెదిరిస్తున్నట్లు సదరు ఠాణా పరిధిలో ప్రచారం జోరందుకున్నది.
‘నీవు సర్పంచ్‌గా ఎలా గెలుస్తావో చూస్తాం.. డబ్బు, మద్యం పంపిణీ ఎలా చేస్తావో మేం చూసుకుంటామంటూ’ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. మరోవైపు డబ్బులిచ్చే అభ్యర్థులు పోటీ చేసే గ్రామ పంచాయతీల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తామని సదరు ఎస్ఐ భరోసానిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఠాణా కేంద్రంగా భూసెటిల్‌మెంట్లకు పాల్పడు తూ పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఆ ఎస్ఐపై ఉన్నాయి. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.