వికారాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వికారాబాద్‌కు చెందిన ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాళు విరిగి విషమంగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ పట్టణం సమీపంలోని శ్రీరామ్‌నగర్ తండాకు చెందిన తారీబాయి(45), బుజ్జిబాయిలతో పాటు మరో ఇద్దరు మహిళలు మొయినాబాద్‌లోని మెలోహా ప్రైవేటు హాస్టల్లో స్వీపర్, అటెండర్ పనులు చేసేవారు. వీరు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరితే.. తిరిగి సాయంత్రం 7:30 గంటల వరకు తిరిగి ఇంటికి చేరుకుంటారు.
వికారాబాద్ ఆర్టీసీ డిపో ముందు నుంచి హైదరాబాద్‌కు బస్సులు వెళ్తుంటాయి. సోమవారం ఇద్దరు ఆలస్యం కావడంతో వారిని వదిలి తారిబాయి, బుజ్జిబాయిలు ఆటోలో వికారాబాద్‌కు వచ్చారు. అక్కడ తాండూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండటంతో వారు బస్సు ఎక్కారు. ఈ ప్రమాదంలో తారిబాయి మృతి చెందగా.. బుజ్జిబాయికి కాళు విరిగింది. తారిబాయి, బుజ్జిబాయిలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. కుటుంబసభ్యులు గాయపడ్డ బుజ్జిబాయిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ దవాఖానకు తరలించారు. తారిబాయి మృతి చెందడంతో చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం చేసి అంబులెన్స్‌లో ఇంటికి పంపించారు. తారిబాయికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. భర్త శంకర్ గత 13 ఏండ్ల కిందటే మృతి చెందాడు.
– హైదరాబాద్ పట్టణానికి చెందిన మూడు కుటుంబాలు 11 మంది తాండూరులోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. తిరిగి సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు తాండూరు సమీపంలోని రాజీవ్‌గృహకల్ప వద్ద వారు బస్సు ఎక్కారు. ఈ బస్సులో చివరన సీట్లు ఉండటంతో అక్కడే కూర్చున్నారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో బస్సు ముందు ఉన్న ప్రయాణికులు మరణించారు. వెనుకాల ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అందులో ఓ మహిళకు తలకు బలమైన గాయాలయ్యాయి. ఒక మహిళకు కుడి కాలు విరిగగా, అద్దుల్లా అనే వ్యక్తికి ఎడమ చేయి విరిగింది. వైద్యులు చికిత్సలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఆర్డీవో వాసుచంద్ర దవాఖానకు వచ్చి గాయపడ్డ వారిని పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో 10 మంది, ప్రైవేటు దవాఖానలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
అతివేగమే ప్రమాదానికి కారణం
తాండూరు నుంచి కుటుంబసభ్యులతో హైదరాబాద్ వెళ్తున్నాము. బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడు. ఈ వేగం చూసి చాలా భయం వేసింది. చేవెళ్ల సమీపంలో కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్, బస్సు రెండు బలంగా ఢీకొన్నాయి. బాంబు పేలినంత శద్దం వచ్చింది. బస్సులో ముందు సీట్లో ఉన్న ప్రయాణికులకు బలమైన గాయాలయ్యాయి. బస్సు చివరల కూర్చున్న మాకు గాయాల అయ్యాయి. 7 మంది పిల్లలు, 6 మంది పెద్దవాళ్లం ఉన్నాము. ఒకరికి కాళు విరిగింది. మరొక్కరికి తలకు గాయమైంది.
– అబ్దుల్లా, గాయపడ్డ ప్రయాణికుడు