కొత్తూరు, డిసెంబర్ 18 : యాసంగి సీజన్లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు నూనెగింజల సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో కుసుమ పంటను కొత్తూరు మండలంలో అధికంగా పండిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద వంద శాతం సబ్సిడీతో కుసుమ విత్తనాలు అందించడంతో రైతులు కుసుమ వేయడానికి మొగ్గుచూపుతున్నారు.
కొత్తూరు మండలంలో 300 ఎకరాల్లో కుసుమ పంట వేశారు. తిమ్మాపూర్ క్లస్టర్ కుమ్మరిగూడలో 110 ఎకరాలు, రెడ్డిపాలెంలో 53, మల్లాపూర్లో 30, గూడూరులో 10, ఫాతిమాపూర్లో 27, ఇన్ముల్నర్వ క్లస్టర్ సిద్దాపూర్లో 8, ఇన్ముల్నర్వలో 2 ఎకరాలు, మండలలోని మిగతా గ్రామాల్లో కూడా కుసుమ పంటను సాగు చేస్తున్నారు.
కుసుమ సాగుతో పెట్టుబడి తక్కువగా ఉండి లాభాలు అధికంగా ఉంటున్నాయి. కుసుమ కేవలం 90 రోజుల పంట. దీనికి నీటి వసతి కూడా ఎక్కువగా అవసరంలేదు. రెండు నుంచి మూడు తడులు మాత్రమే అవసరముంటాయి. ఎకరా కుసుమ పండించడానికి రూ.18 నుంచి రూ.20 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ఒక ఎకరంలో 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. క్వింటాలు కుసుమ మద్దతు ధర 5,650 ఉంది. ఒక క్వింటాలుకు సుమారు రూ.15 వేల వరకు లాభం వస్తుంది.
ఆశాజనకంగా.. తెల్ల కుసుమ పంట
చేవెళ్ల రూరల్ : యాసంగిలో రైతులు ఎక్కువగా తెల్ల కుసుమ పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్ల కుసుమ సాగులో ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయి. గతంలో కంటే ఈ సారి సాగు గణనీయంగా పెరిగింది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో తెగుళ్లను నివారిస్తూ అధిక దిగుబడులు సాధించేలా సాగు చేస్తున్నారు.
గతంలో కంటే ఈసారి..
చేవెళ్ల మండల పరిధిలో గత సంవత్సరం కంటే ఈసారి తెల్ల కుసుమ సాగు విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరం 2004 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 2412 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపల్లి గ్రామంలో అత్యధికంగా 400 ఎకరాల్లో తెల్ల కుసుమ పంట సాగు చేయగా, అతి తక్కువగా నాంచేరి అనుబంధ గ్రామం కిష్టాపూర్లో 10 ఎకరాల్లో తెల్ల కుసుమ పంట సాగు చేస్తున్నారు.
ఒకసారి నీరు అందించినట్లయితే..
యాసంగి సాగు అయిన తెల్లకుసుమ పంట విత్తనం విత్తిన తర్వాత తడి కొంత మేరకు ఉన్నట్లయితే విత్తనం మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పొలం తడిగా లేకపోతే ఒకసారి నీరు అందించినట్లయితే (పొలాన్ని తడిపినట్టయితే) తొందరగా విత్తిన గింజలు మొలకెత్తుతాయి.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నాం
– అనిత, ఏఈవో, కొత్తూరు
రైతులను సంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా కుసుమ పంట తక్కువ రోజుల్లో పండుతుంది. దీనికి నీరు కూడా ఎక్కువగా అవసరంలేదు. దీంతోపాటు పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. లాభం బాగా ఉంటుంది. ప్రభుత్వం కూడా నూనె గింజల పంటను ప్రోత్సహిస్తూ రైతులకు వంద శాతం సబ్సిడీ కింద విత్తనాలను కూడా అందిస్తున్నది.
7 ఎకరాల్లో సాగు చేశా : అంజిరెడ్డి, మల్లాపూర్
ప్రతి యాసంగిలో కుసుమ సాగు చేస్తా. ఈ ఏడాది 7 ఎకరాల్లో సాగు చేశా. కుసుమ పంటకు కష్టం తక్కువగా ఉంటుంది. విత్తనాలు వేసిన తర్వాత ఒకటి, రెండు సార్లు నీటి తడి ఇస్తే సరిపోతుంది. పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. నూనె గింజల పంటలకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించడంతో మా గ్రామంలో చాలా మంది రైతులు కుసుమ పంటను సాగు చేస్తున్నారు.
సులువుగా పండుతుంది : తులసీ, ఏవో
యాసంగిలో తెల్లకుసుమ పంట సులువుగా పండించేందుకు వీలుగా ఉంటుంది. మిగతా పంటలతో పోల్చితే అడవి పందులు, నెమళ్ల బెడద ఉండదు. రైతులకు తెల్ల కుసుమలు నూనె పట్టించిన అనంతరం నేరుగా విక్రయించేందుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో వంటలకు ఈ నూనెను వాడుతున్నారు.
తెల్ల కుసుమలపై ఆసక్తి : రమాదేవి, ఏడీఏ
రైతులు గతంలో కంటే ఈ సంవత్సరం తెల్ల కుసుమ పంటను సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగి పంట కావడం.. మిల్లులో నూనె పట్టించిన అనంతరం నేరుగా విక్రయించుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు తెల్ల కుసుమ నూనె 15 లీటర్లకు రూ.4800 నుంచి 5000 వరకు నేరుగా వినియోగదాలరుకు విక్రయిస్తున్నారు. విక్రయానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో రైతులు తెల్లకుసుమ పంట సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.