Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, మార్చి 4 : ఒకప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ పేదవాడికి అనారోగ్య సమస్య వచ్చినా.. సర్కార్ దవాఖాన ఉందనే ధీమాతో వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వెళ్లేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు తుర్కయంజాల్, ఆదిభట్ల మున్సిపాలిటీల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సేవలు అందించిన ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రిని ఇప్పుడు పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. వైద్య సేవలతో పాటు పారిశుద్ధ్యం విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. దిగజారుతున్న ఈ పరిస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు ఎంతోమంది రోగులకు ఉత్తమ సేవలందించిన ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రి నేడు పనికి రాకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలతో వచ్చినా వైద్యులు, నర్సులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మంత్రులు వస్తున్నారని.. ఆగమేఘాల మీద పారిశుద్ధ్య పనులు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణలను శుభ్రం చేసేవారు. ఆస్పత్రి ఆవరణలోని చెత్తను ట్రాక్టర్లు, ఆటోల ద్వారా మున్సిపల్ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించేవారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సేవలు అందించడం పక్కన బెడితే చెత్తను తొలగించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నాడు ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా మంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారన్న సమాచారం రావడంతో ఉదయం 4గంటల నుంచే మున్సిపల్, ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు చకచక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గత ఏడాది కాలంగా ఈ ఆస్పత్రిలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించేందుకు కూడా ఆసక్తి చూపని మున్సిపల్ అధికారులు…మంగళవారం మంత్రి పర్యటన సందర్భంగా ఆగమేఘాల మీద చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించారు. మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నారన్న సమాచారంతో చెత్తనివారణ, పిచ్చిమొక్కల తొలగింపు పనులు చేపట్టారు. మామూలు రోజుల్లో వివిధ రోగాలతో ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల ప్రభుత్వ ఆస్పతి సిబ్బంది, మున్సిపల్ అధికారులకు కండ్లు కనిపించటం లేదా అని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా మంత్రి పర్యటన వాయిదా పడిందన్న సమాచారంతో పనులు సగానికే వదిలేసి మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు.