బన్సీలాల్‌పేట్: గాంధీ దవాఖానలోని ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రంలో తొలిసారిగా సంతానోత్పత్తి విజయవంతమైందని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎంసీహెచ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానల్లో కూడా ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. 2024 అక్టోబర్ నుంచి గాంధీ, డిసెంబర్ నుంచి పేట్లబూర్జ్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇప్పటివరకు 27,327 మంది సంతానం లేనివారికి ఓపీ ద్వారా వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. ఐవీఎఫ్‌లో అనేక క్లిష్టమైన విధానాలు ఉంటాయని, మొదటి ఐవీఎఫ్ జననం గాంధీ దవాఖాన ఘనతేనని చెప్పారు. కాగా, ఐవీఎఫ్ ద్వారా సంతానోత్పత్తి కలిగిన దంపతులు మీడియా సమావేశంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రైవేటులో లక్షలాది రూపాయలు అవుతాయని, గాంధీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని, ఇక్కడి వైద్యులు, నర్సులు, సిబ్బందికి తాము రుణపడి ఉంటామని చెప్పారు.