సిటీబ్యూరో, జూన్ 21 : గుడి మాయమైంది. నిర్మించిన ఆలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొలగించా రు. రూ.కోట్ల విలువైన సర్కారు స్థలం కబ్జాకు గురైం ది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దేవాలయాన్ని తొలగించి వేరే వారికి అప్పగించే ఈ వ్యవహారంలో ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధితోపాటు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులకు పెద్దఎత్తున ముడుపులు అందిన ట్టు ఆరోపణలున్నాయి. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పెద్దఅంబర్‌పేట-పసుమాముల జడ్పీ రోడ్డు మధ్యలో కళానగర్ ఉన్నది.
అక్కడున్న ప్రాథమిక పాఠశాల పక్క న గౌడ సంఘం భవనం పక్కనే.. జిల్లా పరిషత్ రోడ్డును ఆనుకుని పసుమాముల రెవెన్యూ 386 సర్వేనంబర్‌కు సంబంధించి రూ.5 కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమి ఉన్నది. దీని వెనకే పట్టా భూములున్నాయి. రెండేండ్ల కిందటి వరకు పట్టా భూమి ఉన్న యజమాని రోడ్డును ఆనుకుని ఉన్న భూమిని వదిలేసి వెనక ప్రహరీ నిర్మించాడు. ఖాళీగా ప్రభుత్వ స్థలంలో కళానగర్వాసులు శివుడి ఆలయ నిర్మాణాన్ని చేపట్టా రు. అయితే, పట్టా భూమికి నేరుగా రోడ్డు కోసం యజమాని ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది.
దానికి స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో తన భూమి వరకు హద్దుగా ప్రహరీ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. అయితే, స్థానికులంతా కలిసి రోడ్డుకు ఆనుకుని ఉన్న 386 సర్వేనంబర్ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో ఆలయాన్ని నిర్మించగా.. మిగతా స్థలం ఖాళీగానే ఉండేది. గుడి నిర్మాణం దాదాపు పూర్తికాగా.. విగ్రహ ప్రతిష్ఠాపన ఒక్కటే మిగిలి ఉన్నది…అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏమైందో ఏమో తెలియదు కానీ, ఏడాదిన్నరలోనే ఆ ఆలయం కూడా మాయమైంది. గుడి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఆ స్థలంలో షెడ్డు నిర్మాణం ప్రారంభమైంది.
కళానగర్‌లోని ప్రాథమిక పాఠశాలకు ఆనుకుని, గౌడ సంఘం భవనం ఉండగా.. దానికి ఆనుకుని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గుడి మాయమవడం వెనుక పలువురికి పెద్దఎత్తున ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. గుడిని పూర్తిగా తొలగించడంతోపాటు ప్రహరీని ముందుకు కదిలించేందుకు భారీగానే కానుకలు సమర్పించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రోడ్డుకు ఆనుకుని 386 సర్వేనంబర్‌కు సంబంధించి ప్రభుత్వ స్థలం ఉండగా ఇప్పుడు కనిపించడం లేదు. దాదా పు రూ.5 కోట్లకుపైగా విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధితోపాటు స్థానికంగా ఉన్న ముగ్గురు మాజీ ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున అందినట్లు.. వారికి కానుకలు ముట్టాకే.. అక్కడి గుడి మాయమైనట్టు తెలుస్తున్నది.
గుడిలో లింగం ప్రతిష్ఠాపనకు ముందే గుడితోపాటు రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సైతం కనిపించకుండాపోయింది. అయినప్పటికీ ఏ శాఖ అధికారులూ అటువైపు కన్నెత్తి చూడటంలేద ని.. నిర్మించి ఆలయాన్ని సైతం తొలగించడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ గ్రామంలో గుడి పేరుతో పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై ఇటీవల నమస్తే తెలంగాణలో ‘గుడి పేరిట బురిడీ’ శీర్షికన వచ్చిన కథనంతో ఆక్రమణల పర్వానికి అడ్డుపడింది. అక్కడ గుడి పేరుతో కబ్జాకు తెరలేపితే.. ఇక్కడ ఏకంగా గుడినే మింగేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం గమనార్హం.