మేడ్చల్, ఏప్రిల్15(నమస్తే తెలంగాణ): కేటాయించిన డబుల్‌బెడ్ రూమ్‌లలో లబ్ధిదారులు చేరకుంటే రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న డబుల్‌బెడ్ రూమ్‌ల లబ్ధిదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈనెల 20లోపు మరోసారి నోటీసులు ఇచ్చి రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్‌లను ఇండ్లు లేని వారిని గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని వారికి అందించింది. జిల్లాలోని బండ్లగూడ, రాంపల్లి, జవహర్‌నగర్ పరిధిలోని ఆహ్మద్గూడ, తూంకుంట, శామీర్‌పేట్ మండలం మురహరిపల్లి, ప్రతాపసింగారం, కొర్రెముల, దుండిగల్‌లో వేలాది సంఖ్యలో డబుల్‌బెడ్ రూమ్‌లను నిర్మించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తూ సర్టిఫికెట్లు అందించారు.
లబ్ధిదారులకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు కేటాయించినా వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో 6,203 డబుల్బెడ్రూమ్ ఇండ్లు నిర్మించగా.. 1500 మంది లబ్ధిదారులు మాత్రమే చేరగా, మరో 4,500 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఇక్కడే ఖాళీగా ఉన్నాయి. ప్రతాపసింగారంలో 2వేల మంది లబ్ధిదారులకు..1100 మంది లబ్ధిదారులు మాత్రమే చేరారు. మరో 900 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. తూంకుంట మండలం మురహరిపల్లిలో 2,200 మంది, దుండిగల్‌లో 396 మంది, కొర్రెములలో 30 మంది లబ్ధిదారులు డబుల్‌బెడ్ రూమ్‌లలో చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తలుపులు, కిటికిలు విరిగిపోతున్నాయని, దీంతో ఇబ్బందులు వస్తున్న క్రమంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లను ఖాళీగా ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రజాపాలనలో ఇండ్ల కోసం అనేక దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో డబుల్ ఇండ్లలో చేరిని వారి గుర్తింపును రద్దు చేసి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారికి అందించేల చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ డబుల్‌బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంజూరు చేసిన డబుల్బెడ్రూమ్ ఇండ్లను ఈనెల 20వ తేదీ లోపు వచ్చి నివసించకుంటే మీకు ఇల్లు అవసరం లేదని భాంచి రద్దు చేయుటకు అధికారులకు సిఫారసు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ బోర్డును ఏర్పాటు చేసింది.