యాచారం, జూలై 29 : ఫార్మాసిటీ భూసేకరణలో అవార్డు జారీ చేసిన భూములు తమ స్వాధీనంలో ఉన్నాయంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఓ దినపత్రిక ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీవో చేసిన ప్రకటన ముమ్మాటికీ అసత్యమన్నారు. అవార్డు జారీని సవాల్ చేస్తూ రైతులు, ప్రజలు హైకోర్టులో కేసు వేయగా.. మేడిపల్లి, కుర్మిద్దకు చెందిన 12 కేసులను రద్దు చేసిందని.. మిగతా కేసుల్లో భూమిని స్వాధీన పర్చుకోవద్దని హైకోర్టు ఆదేశించినట్లు ఆమె గుర్తు చేశారు.
కోర్టు ఆదేశాలు ఉండగా భూములు మావే అంటూ ఆర్డీవో ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్డీవో చేసిన ప్రకటన కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందన్నారు. ఫార్మాసిటీకి ఇవ్వని భూములను రైతుల నుంచి తీసుకోవద్దని కోర్టు ఆదేశాలున్నట్లు ఆమె గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి.. ఆన్లైన్లో రైతుల పేర నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతు భరోసా, పంటరుణాలు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు వెం టనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్నారు.
అధికారులు, కొంతమం ది రాజకీయ నాయకులు రైతులను మభ్యపెట్టి భూములను లాక్కోవాలని చూస్తున్నా రని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఫార్మాసిటీకి 2500 ఎకరాల భూమిని ఇచ్చేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు తప్పుడు ప్రకటనలను మానుకోవాలని, లేకుంటే న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో బాధిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.