హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని, వినియోగదారుల అవసరాల మేరకు గ్యాస్ అందుబాటులో ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, కార్యదర్శి వేగుగోపాల్, ఎగ్జిక్యూటివ్ సభ్యుల బృందం మంత్రిని కలిసి ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినతిపత్రం అందజేశారు.
గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి వేలాది హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు మంత్రికి వివరించారు. హోటల్ పరిశ్రమకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అడ్డంకుల తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, గ్యాస్ ఏజెన్సీలు ఏవైనా అవకతవకలకు పాల్పడినట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు సద్ది వెంకట్‌రెడ్డి తెలిపారు.