హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అయితే, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెట్టడం మరో అద్భుతం. 2014లో స్వరాష్ట్రం సిద్ధించినప్పుడు అనేక ఆర్థిక సవాళ్లు, సందేహాలు ఉన్నప్పటికీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దార్శనికతతో అన్నీ పటాపంచలయ్యాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశ సగటు కంటే వేగంగా వృద్ధి చెందింది. తెలంగాణ బడ్జెట్ అంచనాలు ఏటికేడు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. 2014-15లో కేవలం రూ. 1 లక్ష కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్, 2023 నాటికి రూ.2.90 లక్షల కోట్లకు చేరడం ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం తొమ్మిదేండ్ల కాలంలో బడ్జెట్ పరిమాణం మూడు రెట్లు పెరుగడం అనేది తెలంగాణ ఆర్థిక శక్తికి నిదర్శనం. సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాలుగా మలచడం వల్లే ఇది సాధ్యమైంది. కేసీఆర్ ముందుచూపు, సరైన ప్రాధాన్య అంశాల ఎంపికతో పదేండ్లు స్థిరమైన వార్షిక వృద్ధిని రాష్ట్రం సాధించగలిగింది. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కనబరిచింది. ఏటా సగటున 12 నుంచి 15 శాతం వరకు బడ్జెట్ అంచనాలను పెంచుకుంటూ పోవడం ద్వారా, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణను అగ్రభాగాన నిలిపారు కేసీఆర్.
కరోనా కష్టాలను అధిగమించి..
2014లో రూ.1 లక్ష కోట్లతో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ ప్రయాణం.. 2023-24 నాటికి రూ.2.90 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 188 శాతం (3 రెట్లు)వృద్ధిని నమోదు చేసింది. 2021-22 సంవత్సరంలో బడ్జెట్ పరిమాణంలో మునుపటి ఏడాది కంటే దాదాపు 26 శాతం వృద్ధి నమోదైంది. తెలంగాణ ఆర్థిక ప్రస్థానంలో 2021-22 సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. కరోనా వంటి విపతర పరిస్థితుల తర్వాత కూడా, ఏకంగా 25 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేసింది. మొట్టమొదటిసారిగా బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లను దాటింది. గతంలో ఎప్పుడూ లేనంత గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇది రాష్ట్ర పటిష్టమైన ఆర్థిక పునాదులకు, ప్రభుత్వ సమర్థ నిర్వహణకు నిదర్శనంగా నిలిచింది.
అభివృద్ధికి కేరాఫ్
మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ప్రస్థానం మొదలుపెట్టి, ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించడంలో కేసీఆర్ ప్రభుత్వం విజయం సాధించింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాలకు ఈ భారీ బడ్జెట్లే వెన్నెముకగా నిలిచాయి. నేడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఇంత బలంగా ఉందంటే, దానికి పునాది కేసీఆర్ హయాంలో పదేండ్ల ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ కేటాయింపులే కారణమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ కేటాయింపులు (2014-2024) (రూ. కోట్లలో)
