KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పది కి పది మార్కులు ఇవ్వొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: ఢిల్లీకి సంచులు ( Carrying Bags ) మోయడంలో, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth ) కి పది కి పది మార్కులు ఇవ్వొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మాత్రం ఆయనకు ఎలాంటి మార్కులు ఇవ్వలేమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక వన్ టైమ్ వండర్ లీడర్ అని, 2028 డిసెంబర్ నాటికి ఆయన రాజకీయ ఏటీఎం గడువు ముగుస్తుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎంగా మారారని, 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ (ABP Southern Rising Summit)లో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పెట్టుబడులు, ఉద్యోగాలు, అవినీతి తదితర అంశాలపై మాట్లాడారు. 2015లో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో ఫోరెన్సిక్, డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని, ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ప్రస్తావించారు. అప్పట్లో ఎమ్మెల్యేకు సంచులు తీసుకెళ్లే స్థాయి నుంచి ఇప్పుడు ఢిల్లీ వరకు సంచులు తీసుకెళ్లే స్థాయికి ఎదిగారని విమర్శించారు. రాహుల్ గాంధీకి రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయని, ఒకటి రేవంత్ రెడ్డి, మరొకటి డీకే శివకుమార్ అని వ్యాఖ్యానించారు. ఈ రెండు ఏటీఎం కార్డుల గడువు 2028లో ముగుస్తుందని అన్నారు.
సాధ్యం కాని హామీలు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా వాటి గురించి సమాధానం చెప్పడం లేదన్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందని గుర్తుచేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను తిట్టడం, కొత్త కేసులు పెట్టడం, కొత్త కమిషన్లు ఏర్పాటు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఆటో డ్రైవర్లను, మహిళలను, ఉద్యోగులను అడిగితే ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం తెలుస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగానే కరువు
తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న కరువు పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల ఫలితమని కేటీఆర్ విమర్శించారు. ఇది ఎల్‌నినో ప్రభావం కాదు.. ఎల్కాంగో ప్రభావం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి తన గడ్డం గురించి మాట్లాడటమే పెద్ద సమస్యగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కేసీఆర్‌తో తనను పోల్చుకోవాలనుకుంటే మాటలతో కాకుండా చేతలతో నిరూపించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో అవినీతి, కమీషన్ల వ్యవహారాలపై స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు దోపిడీ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారని, ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా 15 నుంచి 20 శాతం కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలే ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం లేదన్నారు.
హైడ్రా ఎంపిక చేసుకుని చర్యలు తీసుకునే సాధనంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లు, బ్లాక్‌మెయిలింగ్, వసూళ్లకు ఉపయోగపడుతున్నదని విమర్శించారు. పేదల తాత్కాలిక ఇళ్లు, గుడిసెలను కూల్చివేస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నేరాలు, అవినీతి పెరుగుతున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
పెట్టుబడుల ఫలితాలు ఎక్కడ ?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దావోస్, అమెరికా, జపాన్ పర్యటనల ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రకటిస్తోందని, అయితే ఆ పెట్టుబడుల ఫలితాలు ఎక్కడ కనిపిస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. 2026–27 బడ్జెట్ ప్రసంగంలో హైదరాబాద్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గినట్లు ప్రభుత్వం స్వయంగా పేర్కొందని గుర్తుచేశారు. 2023లో 9.46 లక్షలుగా ఉన్న టెక్నాలజీ ఉద్యోగాలు 2026–27 నాటికి 9.39 లక్షలకు తగ్గాయని, అంటే సుమారు ఏడు వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని వివరించారు. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం వాస్తవంగా ఎంత పెట్టుబడి వచ్చింది, ఎక్కడ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భారత్ సమ్మిట్ కాదు కాంగ్రెస్ సమ్మిట్
భారత్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం వాస్తవానికి కాంగ్రెస్ సమ్మిట్ అని కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉపాధి లేని కాంగ్రెస్ నాయకులను ఒకచోట చేర్చి, రాహుల్ గాంధీని ప్రమోట్ చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశంగా కనిపించిందన్నారు. 70 దేశాల నుంచి ఎవరెవరు వచ్చారో కూడా తనకు తెలియదని, ఈ సదస్సు వల్ల తెలంగాణకు లేదా దేశానికి కలిగిన ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఆసక్తి ఉంటే సొంత నిధులతో నిర్వహించుకోవాలని, తెలంగాణ ప్రజల డబ్బును రాజకీయ ప్రచారానికి ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
గత ఏడాది నిర్వహించిన ఇలాంటి సదస్సుకు సుమారు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు భావిస్తున్నానని, ఈసారి ప్రభుత్వ ఖజానా నుంచి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? తెలంగాణకు ఏం ప్రయోజనం కలిగింది? అనే విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ నిధులతోనే రైతుబంధు పథకానికి సుమారు రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామని, రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని వివరించారు. సుమారు 32 జిల్లాల్లో ఆధునిక కలెక్టరేట్ భవనాలు నిర్మించామని, హైదరాబాద్‌లో దాదాపు 42 ఫ్లైఓవర్లు నిర్మించామని తెలిపారు. గత పదేళ్లలో అప్పులు చేసి కూడా రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించామని చెప్పారు.
మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బుతో ఏ కొత్త పథకాలు తీసుకొచ్చారు? ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించారు? అని ప్రశ్నించారు. గత మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక్క కొత్త పథకాన్ని, నిర్మించిన ఒక్క ప్రధాన ప్రాజెక్టును చూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రజలకు కనిపించే ఫలితాలు ఏమిటని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి రైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇద్దరూ తమ హామీలను నెరవేర్చలేదని, పెద్ద మోదీ అయినా చిన్న మోదీ అయినా హామీల అమలులో ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణను రైజింగ్ చేయడం లేదని, పూర్తిగా మెస్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, పదేళ్ల అభివృద్ధిలో కేసీఆర్ పాత్రను ప్రజలు మరిచిపోలేరని పేర్కొన్నారు. కేసీఆర్‌తో పోల్చుకోవాలంటే మాటలతో కాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిరూపించుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటారని, తెలంగాణకు బాద్షా కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక వన్ టైమ్ వండర్ లీడర్ అని, 2028 డిసెంబర్ నాటికి ఆయన రాజకీయ ఏటీఎం గడువు ముగుస్తుందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
‘మైనారిటీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు’
‘వలసల నివారణే లక్ష్యం’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

